ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా 5 సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆయన చుట్టూ నిర్మాతలు ఈగల్లా మూగుతున్నారు. ఆయన మాత్రం.. దిల్ రాజు కాంపౌండ్ కి కట్టుబడి, వాళ్లకే సినిమాలు తీస్తున్నాడు. త్వరలోనే `ఎఫ్ 3` పట్టాలెక్కబోతోంది. డిసెంబరు రెండో వారంలో షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కి ఏకంగా 80 కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్.
35 కోట్లతో తెరకెక్కిన ఎఫ్ 2.. దాదాపు వంద కోట్లు సాధించింది. అందుకే.. ఎఫ్ 3కి ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఎఫ్ 2కు 100కోట్లు వచ్చాయి కాబట్టి, ఇప్పుడు 80 కోట్లు ఖర్చు పెట్టడం బిజినెస్ పరంగా ఓకే. కానీ రిస్క్ ఎక్కువ. ఎఫ్ 2 సమయంలో ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పైగా సంక్రాంతి సీజన్. కాబట్టి వర్కవుట్ అయిపోయింది. ఈసారి అలా కాదు. అంచనాలు పెరుగుతాయి. సంక్రాంతి బెర్తు దొరుకుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఇలాంటి సమయంలో వెంకీ, వరుణ్ ల కాంబోని నమ్మి 80 కోట్లు పెట్టడం రిస్క్ తో కూడిన ఎత్తుగడే. నిజానికి ఎఫ్ 2 లాంటి కథలు భారీ హంగామాలు ఆశించవు. ఫ్యామిలీ డ్రామాలతో కూడిన సినిమాలివి. కాబట్టి.. తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చు. అయినా సరే.. 80 కోట్లు పెడుతున్నారంటే.. ఇందులో ఇంకాస్త స్పెషల్ ఎట్రాక్షన్‌లు చేరుస్తున్నట్టే. మరి ఇది రావిపూడిపై కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్షిడెన్స్ అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజలు ఆగాలి.