ఇటీవల ఓ సినిమా సెట్లో హీరో విజయ్ ఆంటోనీ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ.. విజయ్ ఆంటోనీ ఆరోగ్యంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఐసీయూలో చికిత్స తీసుకొంటున్నారని ఊహాగానాలు వినిపించాయి. దాంతో తమిళ చిత్రసీమ ఆందోళనకు గురైంది. అభిమానులు కూడా.. హైరానా పడ్డారు. విజయ్‌కి సంబంధించిన హెల్త్ బులిటెన్ గానీ, ఫొటోగానీ బయటకు రాకపోవడంతో.. ఆ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోనీ భార్య ఫాతీమా స్పందించారు.
విజయ్ ఆరోగ్యం బాగానే ఉందని, తుంటికి గాయమవ్వడంతో ఆయన చికిత్స తీసుకొంటున్నారని, త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. ప్రమాదం ప్రాణాంతకం ఏమీ కాదని, ఈ విషయంలో వస్తున్న పుకార్లని నమ్మొద్దని ఆమె కోరారు. బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యాడు విజయ్ ఆంటోనీ. యేడాదికి విజయ్ నుంచి రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా విజయ్‌కి సరైన విజయం లేదు. ఆ ప్రయత్నాల్లోనే ఉండగా సెట్లో ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా ఆయన గాయపడ్డారు.