విజయ్ దేవరకొండ వరస విజయాలకు 'నోటా' బ్రేక్ వేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర గల్లంతయ్యింది. తమిళంలోనూ పాగా వేసేద్దామనుకున్న విజయ్ దూకుడుకి అడ్డుకట్ట వేసింది. ఈ సినిమా పరాజయంపై విజయ్ దేవరకొండ తొలిసారి స్పందించాడు.
''కథ, స్క్రీన్ ప్లే లోపాలతోనే ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. పైగా ఆ రోజుల్లో నేనుఈ సినిమాపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేకపోయా. ఓ వైపు గీతా గోవిందం, మరో వైపు టాక్సీవాలా సినిమాలతో బిజీగా ఉండేవాడ్ని. నోటా రేపు విడుదల అనగా... ఫస్ట్ కాపీ చూశాను. మార్పులూ చేర్పులకు అవకాశమే లేకుండా పోయింది. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది'' అంటూ క్లారిటీ ఇచ్చుకున్నాడు విజయ్‌దేవరకొండ.
సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ లేకపోవడంతో తన జడ్జిమెంట్ పై ప్రభావం పడుతుందన్న విషయాన్ని విజయ్ గ్రహించాడు. అందుకే సినిమా సినిమాకీ గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని, చేసిన తప్పుల్ని ఇక మీదట రిపీట్ చేయకుండా చూసుకుంటానని అంటున్నాడు విజయ్.
''పెళ్లి చూపులు తరవాత ఇప్పటి వరకూ క్షణం కూడా తీరికలేదు. ఇంట్లోవాళ్లకు కూడా సమయం కేటాయించలేకపోతున్నా. ఇక మీదట కాస్త విశ్రాంతి తీసుకుంటా. వచ్చే యేడాది నుంచి ఓ సినిమా పూర్తయ్యాకే మరో సినిమా ఒప్పుకుంటా'' అంటున్నాడు.