యువ హీరోలు తమ కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో, వ్యక్తిగత జీవితం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటున్నారు. ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. విజయ్ దేవరకొండ అందరి కంటే మెచ్యూర్డ్ కాబట్టి - పెళ్లి విషయంలో ఇంకా బాగా ఆలోచిస్తాడనుకుంటారు. కానీ.. పెళ్లి విషయం ఎత్తేసరికి... `అప్పుడే పెళ్లేంటి? నేనింకా చిన్నపిల్లాడినే ` అంటున్నాడు.
పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్లు తొందర పెడుతున్నారని, అయితే.. తాను ఈ విషయంలో ఇంకా ఎదగాల్సివుందని, తానింకా చిన్నపిల్లాడినే అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు విజయ్. పెళ్లిలో ఓ మెచ్యూరిటీ లెవిల్స్ ఉంటాయని, ఒకరి జీవితంపై మరొకరికి అజమాయిషీ, ఆధిపత్యం కనిపిస్తాయని, జవాబుదారీ తనం ఉండాలని... అయితే వాటిని అర్థం చేసుకోవడానికి తనకు ఇంకాస్త సమయం కావాలని అంటున్నాడు.
అయితే తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం, గౌరవం ఉన్నాయని, పెళ్లికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు. టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి విజయ్ దేవరకొండ. ప్రతీ సినిమాలోనూ అరడజను ముద్దులైనా ఉంటాయి. ఆ విషయంలో రౌడీ రాటుదేలిపోయాడు. ముద్దుల్లో పీహెచ్‌డీ చేసి.. ఇప్పుడు చిన్నపిల్లాడినే అంటాడేంటి? ఏదేమైనా ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడంలో విజయ్ రూటే సెపరేటు.