స్టార్ హీరోలు సైతం ఫ్లాప్‌లకు అతీతం ఏమీ కాదు. విజయం బాధ్యతను పెంచితే, పరాజయం అనుభవాన్నిస్తుందని చెబుతుంటారు అగ్రహీరోలు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన స్టార్ హీరోల వెంట వచ్చే ఇలాంటి మాటలు యువతరానికి 'స్వీట్ వార్నింగ్' ఇస్తుంటాయి.
అయితే ఒక్క హిట్టుతో ఎగిరిపడటం, ఒక్క ఫ్లాప్‌తో డీలా పడిపోవడమే తప్ప - స్టడీగా కెరీర్‌ని బిల్డప్ చేసుకోవడం ఎంతమంది యంగ్ హీరోలకు సాధ్యమవుతోంది? హీరోల సంగతి పక్కన పెడితే, వారి అభిమానుల ఓవరాక్షన్ ఈ మధ్య ఎక్కువైపోతోంది. ఎంత పెద్ద హిట్ కొట్టినా యంగ్ హీరోలు కొందరు 'ఒదిగి' వుంటున్నారు. కానీ, వారి అభిమానులే ఇతర హీరోలతో తమ హీరోని పోల్చి రచ్చ చేసేస్తున్నారు. నాగశౌర్య, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రగడ జరుగుతోంది.
నాగశౌర్య తాజా చిత్రం 'నర్తనశాల' అంచనాల్ని అందుకోలేకపోవడంతో విజయ్ అభిమానులు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిక్కారణం, యంగ్ హీరోల స్టార్‌డమ్‌పై నాగశౌర్య ఇటీవల చేసిన వ్యాఖ్యలే. ఆ వ్యాఖ్యలు విజయ్ మెగా సక్సెస్‌ని చిన్నబుచ్చేలా వున్నాయన్నది విజయ్ అభిమానుల ఆరోపణ.
'హీరోలం మేం బాగానే వుంటాం, అభిమానులే హద్దులు దాటేస్తున్నారు..' అని ఎంతమంది హీరోలు ఎంతలా తమ అభిమానుల్ని హెచ్చరిస్తున్నా, వారిలో మార్పు రావడంలేదు. ఫ్లాప్ రావడమంటే నేరం చేసినట్టు కాదు. ఈ విషయం కొందరు దురభిమానులకు అర్థమవుతుందనుకోవడం హాస్యాస్పదమే.