వంద కోట్లు.... ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి స్టార్ హీరోలకు సైతం దశాబ్దాలు పట్టింది. కొంతమంది హీరోలకు ఇంకా వంద కోట్ల మైలు రాయి అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. అయితే నాలుగో చిత్రానికే వంద కోట్లు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు విజయ్ దేవరకొండ. 'గీత గోవిందం' వంద కోట్ల మైలు రాయి చేరుకున్న సంగతి తెలిసిందే.
ఈ సూపర్ హిట్టుతో స్టార్ హీరోల సరసన చేరిపోయాడు విజయ్. అతని ఫాలోయింగ్ కూడా రోజురోజుకీ ఎక్కువైపోతోంది. వరుస విజయాల ప్రభావం `నోటా`పై పడింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ లాభాల్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.25 కోట్లకు అమ్ముడుపోయిందని ట్రేడ్ వర్గాల టాక్.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.18 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ ద్వారా దాదాపు రూ.4 కోట్లు వచ్చాయని సమాచారం. కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రెండూ కలిపి మరో రూ.3 కోట్ల వరకూ పలికింది. తెలుగు, తమిళ భాషల్లో 'నోటా' ఒకేసారి విడుదల అవుతోంది. ఇప్పుడు చెప్పినవన్నీ తెలుగు అంకెలే. తమిళంలో జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేసుకుంటున్నారు.
ఎటు చూసినా.. 'నోటా' రూపంలో నిర్మాతలపై కోట్ల వర్షం కురిసినట్టే. ఎందుకంటే రూ.15 కోట్ల బడ్జెట్‌తో పూర్తయిన సినిమా ఇది. థియేటరికల్ రైట్స్, శాటిలైడ్, డిజిటల్ ఇలా అన్నీ కలుపుకుంటే దాదాపుగా రూ.40 కోట్ల బిజినెస్ జరిగి ఉంటుందని అంచనా. అంటే రూపాయికి రెండు రూపాయల లాభం తెచ్చుకున్నట్టే. విజయ్ స్టామినాకు ఇంతకంటే రుజువేం కావాలి??