దేవదాస్ విడుదలకు ముందు, బిగ్ బాస్ 2 ఫైనల్‌కి ముందు నాని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఆ సమయంలో 'బిగ్ బాస్ అయిపోతోంది కదా? హమ్మయ్య అయిపోతోంది అనుకుంటున్నారా, అప్పుడే అయిపోయిందే అని బాధ పడుతున్నారా' అని అడిగిన ప్రశ్నకు... ''హమ్మయ్య అయిపోతోంది అనుకుంటున్నా'' అంటూ నిజాయతీగా సమాధానం ఇచ్చాడు నాని. కనీసం కర్టెసీకైనా 'బిగ్ బాస్ షోని బాగా ఎంజాయ్ చేశాను' అనకుండా ''ఇంత ఒత్తిడిని నా జీవితంలోనే అనుభవించలేదు'' అని కుండబద్దలుకొట్టాడు. నాని ఆ స్థాయిలో హర్టయ్యాడు మరి.
నాని కామెంట్ల వెనుక బలమైన కారణం ఉంది. బిగ్ బాస్ 2 షోకి నాని వ్యాఖ్యత అనగానే చాలామంది చాలా రకాలైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్థానాన్ని నాని భర్తీ చేయగలడా? ఆ కెపాసిటీ నానికి ఉందా? బుల్లి తెర వీక్షకుల్ని ఆకర్షించే మ్యాజిక్ నాని దగ్గర ఉందా అని నానా రకాలుగా అనుమానించారు. నాని వ్యాఖ్యాతగా రాణించాడు. ఆకట్టుకున్నాడు. తన వాక్ చాతుర్యంతో తనకిచ్చిన బాధ్యత నిలబెట్టుకున్నాడు.అయినా ఎక్కడో అసంతృప్తి.
ఎన్టీఆర్‌తో పోల్చడం వల్ల నాని ఎంత చేసినా... కిక్ రాకుండా పోయింది. దానికి తోడు కౌశల్ ఆర్మీ నానికి తలనొప్పిగా తయారైంది. బిగ్ బాస్ హౌస్‌లో నాని కౌశల్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని కౌశల్ అభిమానులు నానిపై కస్సుబుస్సుమన్నారు. సోషల్ మీడియా వేదికగా నానిపై ట్రోల్ చేశారు. 'నీ సినిమాలు చూడం' అంటూ బెదిరించారు. ఇవన్నీ నానిని బాగా హర్ట్ చేశాయి. దాంతో పాటు.. అటు సినిమాలు, ఇటు బిగ్ బాస్ - ఈ రెండింటినీ సమన్వయ పరచుకోవడానికి నాని చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సివచ్చింది.
అందుకే ''ఇంత ఒత్తిడిని ఎప్పుడూ అనుభవించలేదు. బిగ్ బాస్ వల్ల నాకు ప్రపంచం అంటే ఏమిటో తెలిసింది. మనల్ని ద్వేషించేవాళ్లుకూడా ఉంటారని అర్థమైంది. ప్రపంచంలోని మనుషులందరినీ ఒకేలా మెప్పించలేమని అర్థమైంది'' అంటూ వ్యాఖ్యానించాడు. బహుశా బిగ్ బాస్ 3కి హోస్టింగ్ బాధ్యతలు అప్పటించినా.. నాని మరో మాట లేకుండా తిరస్కరిస్తాడేమో. ఆ స్థాయిలో హర్టయ్యాడు నాని.