`అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` సినిమాలతో స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. `లైగర్`తో తన క్రేజ్‌ని పాన్ ఇండియా స్థాయిలో చూపిద్దామనుకొన్నాడు. కానీ ఆ ప్రయత్నం బెడసి కొట్టింది. `లైగర్`తో విజయ్ తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకొన్నాడని, విజయ్ పారితోషికం ఈ సినిమాతో దాదాపు రూ.15 కోట్ల వరకూ చేరుకుందని వార్తలొచ్చాయి. ఇప్పుడు లైగర్ ఫ్లాప్ అవ్వడంతో తన పారితోషికం నుంచి రూ.6 కోట్లు వెనక్కి ఇచ్చారని కూడా చెప్పుకొంటున్నారు.
నిజానికి ఈ సినిమా కోసం విజయ్ తీసుకొన్న పారితోషికం కేవలం రూ.3 కోట్లే. `లైగర్`పై విజయ్‌కి ముందు నుంచీ గట్టి నమ్మకం ఉండేది. అందుకే ఈ సినిమా లాభాల్లో వాటా తీసుకొంటానని చెప్పాడట విజయ్. దానికి పూరి కూడా అంగీకరించాడు. అయితే.. అడ్వాన్స్ రూపంలో రూ.3 కోట్లు అందుకొన్నాడు. `లైగర్`కి విపరీతమైన బజ్ ఏర్పడడంతో.. పూరికి సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల వరకూ లాభాలొచ్చాయి. వాటిలో కరణ్ జోహార్ రూ.25 కోట్లు పట్టుకెళ్లిపోయాడు. తీరా చూస్తే ఇప్పుడు లైగర్ భారీ నష్టాల పాలైంది. తన లాభం రూ.25 కోట్లని వెనక్కి ఇవ్వడానికి పూరి ముందుకొచ్చాడు. విజయ్ ఈ సినిమా నుంచి తీసుకొంది రూ.3 కోట్లే కాబట్టి, తాను తిరిగి ఇవ్వడానికి ఏం లేదు. మూడేళ్ల కష్టానికి.. విజయ్ దేవరకొండకి దక్కింది కేవలం మూడు కోట్లయితే, పూరికి శూన్యం అనుకోవాలి.