నిజం, పవన్‌కళ్యాణ్ కొట్టినట్లే విజయ్ దేవరకొండ కూడా సూపర్ హిట్ కొట్టాడు. 'గీత గోవిందం' సినిమాతో పోల్చదగ్గ వసూళ్ళు కాకపోయినా, 'ట్యాక్సీవాలా' సాధించిన విజయం అలాంటిలాంటిది కాదు.
'అత్తారింటికి దారేది' విడుదలకు ముందే లీక్ అయినా, అభిమానులు ఆ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సంచలన విజయాన్ని అందించారు. ఆ సినిమాలో కంటెంట్ అలాంటిది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలని పవన్‌కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో డైలాగుంటుంది. అలా కంటెంట్ ఉన్న సినిమా చుట్టూ ఎన్ని కుట్రలు జరిగినా, ఆ సినిమా విజయాన్ని ఆపలేరని 'అత్తారింటికి దారేది' ప్రూవ్ చేసింది. 'అత్తారింటికి దారేది' తర్వాత అలాంటి చర్చ 'ట్యాక్సీవాలా' గురించి జరగడానికి కారణం ఈ సినిమా కూడా విడుదలకు ముందు లీక్ అయి, విడుదలయ్యాక సూపర్ హిట్ అవడమే.
'ట్యాక్సీవాలా' ఇప్పటికే 25 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరింది. ఇది చిన్న విషయం కాదు. విజయ్ దేవరకొండ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 10 కోట్లు రావొచ్చని అంచనా వేశాడు. అంతకు మించి వసూళ్ళను సాధిస్తోంది 'ట్యాక్సీవాలా'. ఓవర్సీస్‌లో హాఫ్ మిలియన్ మార్క్‌ని ఇప్పటికే అందుకుంది 'ట్యాక్సీవాలా'. నవంబర్ 29న '2.0' సినిమా విడుదలవుతుండగా, అప్పటివరకూ పెద్ద సినిమాలేమీ లేవు తెలుగులో కూడా. దాంతో 'ట్యాక్సీవాలా' బ్లాక్ బస్టర్ రైడ్‌కి ఎలాంటి అవరోధాలూ లేవు. ఈలోగా మేగ్జిమమ్ వసూళ్ళను 'ట్యాక్సీవాలా' సొంతం చేసుకోవచ్చు.
ఏదిఏమైనా పవన్‌కళ్యాణ్‌తో విజయ్ దేవరకొండని పోల్చడం ఈ సందర్భంలో నూటికి నూరుపాళ్ళూ సబబే. ఈ సినిమాని తమ భుజాన మోస్తున్న రౌడీస్, తమ అభిమాన హీరోకి సూపర్ సక్సెస్ అదదించారని నిస్సందేహంగా చెప్పొచ్చు.