'ట్యాక్సీవాలా' ఎలా వుంటాడంటే..

By iQlikMovies - March 21, 2018 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

విలక్షణమైన సినిమాలతో నటుడిగా తన స్థాయిని సినిమా సినిమాకీ పెంచుకుంటూ వెళుతున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. 'పెళ్ళిచూపులు' అతన్ని హీరోగా మార్చితే, 'అర్జున్‌రెడ్డి' సినిమా స్టార్‌ని చేసేసింది. అనూహ్యమైన స్టార్‌డమ్‌ రాత్రికి రాత్రి విజయ్‌ దేవరకొండ సొంతమైందంటే దానికి కారణం 'అర్జున్‌రెడ్డి' సినిమానే. 

ఈసారి ఇంకో విలక్షణమైన సినిమా చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. ఆ సినిమా టైటిల్‌ 'ట్యాక్సీ వాలా'. తెలుగు సినిమా స్క్రీన్‌పై ఎందరో హీరోలు ట్యాక్సీవాలాలుగా కన్పించారు. ఇప్పుడీ యంగ్‌ హీరో కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. అయితే ఇదొక కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ అట. ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. ఆ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ ఏంటన్నది ఇప్పటికైతే సస్పెన్సే. మార్చి 23న ట్యాక్సీవాలా ఫస్ట్‌ లుక్‌ రాబోతోంది. ఆ ఫస్ట్‌ లుక్‌తో 'ట్యాక్సీ వాలా' అసలు కథేంటో కొంత క్లారిటీ రాబోతోందని సమాచారమ్‌. 

మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పరమ రొటీన్‌గానే 'ఇదొక భిన్నమైన సినిమా' అని చాలామంది దర్శక నిర్మాతలు చెబుతుంటారు. అయితే 'ట్యాక్సీవాలా' మాత్రం ఖచ్చితంగా చాలా భిన్నమైనదట. ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారాన్ని బట్టి చూస్తే, థియేటర్లలో ప్రేక్షకులకు సూపర్బ్‌ థ్రిల్లింగ్‌గా ఈ సినిమా అనిపిస్తుందని తెలుస్తోంది. ప్రియాంకా జవాల్కర్‌, మాళవికా నాయర్‌ ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS