తమిళ నాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. స్టార్లు కూడా అటువైపు అడుగులు వేస్తున్నారు. కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అని ప్రకటించారు. తాజాగా విజయ్ కూడా అందుకు రెడీ అవుతున్నాడు. విజయ్‌కి తమిళనాట చాలా మంచి పాపులారిటీ వుంది. రజనీకాంత్ తరవాత.. ఆ స్థాయిలో అభిమానగణాన్ని సంపాదించుకున్న హీరో విజయ్ మాత్రమే. విజయ్‌కీ రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చాలాకాలంగా వార్తలు వినవస్తున్నాయి. విజయ్ కూడా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూనే ఉన్నాడు. 2020లో విజయ్ కచ్చితంగా పార్టీ పెడతాడని అభిమానులూ గట్టిగా నమ్మారు. కానీ రజనీకాంత్ రాజకీయ ప్రకటన వచ్చినా, విజయ్ స్థబ్దుగా ఉండడం ఆయన అభిమానులకు నచ్చడం లేదు. అందుకే కొన్ని రోజులుగా విజయ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
తాజాగా విజయ్ అభిమానుల్ని శాంతింపజేసే ప్రయత్నాలు మొదలెట్టాడు. అభిమానులంతా ఓపిగ్గా ఉండాలని, త్వరలోనే తీపి కబురు చెబుతానని బుజ్జగిస్తున్నాడు. ఆదివారం అభిమాన సంఘం ప్రతినిథులతో ఓ సమావేశం జరిగింది. ఇందులో తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు..అభిమానులంతా వేరే పార్టీలోకి వెళ్లాలన్న ఆలోచన చేయకూడదని, త్వరలోనే సొంత పార్టీ వస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. 2021 మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలతోనే విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2021 జనవరిలోనే ప్రకటన చేసే అవకాశం వుంది.