ఎవరి జీవితం పూలపాన్పు కాదు. ముళ్లు దాటుకుని రావాల్సిందే. చాలా చిన్న స్థాయి నుంచి - సూపర్ స్టార్లుగా మారిన వాళ్ల చరిత్ర చూస్తే.. ఆ కథలు వింటే.. `అయ్యో.. ఆ రోజుల్లో అంత కష్టపడ్డారా` అనిపిస్తుంది. అయితే.. ఆ కష్టానికి తగిన ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. అలా కష్టపడి పైకి ఎదిగినవాళ్లలో విజయ్ సేతుపతి ఒకడు. తమిళనాట తాను ఓ సూపర్ స్టార్. తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు. హీరోగా, విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్టుగా... ఇలా పాత్ర ఏదైనా సరే, ఒప్పేసుకుంటాడు. ప్రయోగాలు చేస్తాడు. కమర్షియల్ కథల్నీ ఎంచుకుంటాడు. అందుకే వెర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు. తన పారితోషికం ఇప్పుడు రూ.10 కోట్ల పైమాటే. కానీ.. తన తొలి రోజుల్లో అందుకున్న జీతం ఎంతో తెలతుసా? నెలకు 750 రూపాయలు.
విజయ్‌సేతుపతి నటుడు కాకముందు ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడట. నెల జీతం 750 రూపాయలట. ఈ విషయాన్ని విజయ్‌సేతుపతినే చెప్పాడు. అర్థరాత్రి 12 గంటల వరకూ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే ఉండేవాడని,భోజనం కూడా అక్కడే చేసేవాడినని తన ఫ్లాష్ బ్యాక్ వివరించాడు. అంతేకాదు.. తాను ఎస్‌టీడీ బూత్ లో కూడా పనిచేశాడట. అదంతా పొట్ట కూటి కోసమే. ఇప్పుడు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. జాతకాలు అంతే. అలానే మారిపోతాయి. ఏ పుట్టలో ఏపాముందో ఎవరికి ఎరుక?