చిత్రసీమ మొత్తం ఈగోలతో ముడిపడి నడుస్తుంది. హీరో అయినా, హీరోయిన్లయినా, స్టార్సయినా... ఎవరైనా సరే, దీనికి అతీతులు కారు. ఈగోల్ని పక్కన పెట్టి ఉండేవాళ్లు చాలా అరుదు. కొంతమందైతే చిన్న చిన్న విషయాలకే అలుగుతారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే... ఈమధ్య అమలాపాల్ కి ఈగో హర్టయ్యిందని, నిర్మాతలతో గొడవ పడిందన్నది టాలీవుడ్ టాక్.
అమలాపాల్ ప్రధాన పాత్రధారిగా ఈమధ్య `కుడి ఎడమైతే` అనే వెబ్ సిరీస్ రూపొందింది. రాహుల్ విజయ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ ఆహాలో విడుదలైంది కూడా. ఈ వెబ్ సిరీస్ కి మంచి స్పందన వస్తోంది. అమలాపాల్ నటనకు కితాబులు అందుతున్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ విషయంలోనే అమల అలిగిందని టాక్. విషయం ఏమిటంటే... ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అయితే.. తొలి వెర్షన్ లో అమలాపాల్ పేరు కంటే ముందు రాహుల్ విజయ్ పేరు వేశార్ట. దాంతో అమల అలిగిందట. అమల అలిగిందన్న విషయాన్ని గ్రహించి, అప్పటికప్పుడు ట్రైలర్ మార్చి మరో కొత్త ట్రైలర్ విడుదల చేశార్ట. అసలు అమలాపాల్ పేరు ముందొచ్చిందా? వెనకొచ్చిందా? అనే విషయాన్ని సగటు ప్రేక్షకుడు పట్టించుకోడు. కానీ... స్టార్లు అలా ఉండరు కదా. వాళ్లకి అలాంటివే కావాలి. అసలు అమలాపాల్ ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. ఆమెకు నిర్మాతలు దొరకడమే గగనం. అలాంటి స్థాయిలో ఉన్న అమలపాల్ కూడా నిర్మాతలపై అలిగిందంటే.. హిట్లు కొట్టినవాళ్ల మాటేంటి?