విజయ్ నటించిన 'వారిసు' (తెలుగులో వారసుడు) తమిళ వెర్షన్ ఈరోజు విడుదలైంది. ఉదయాన్నే ప్రీమియర్ షోలు పడిపోయాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రమిది. దిల్ రాజు నిర్మాత. తెలుగు లో `వారసుడు` ఈనెల 14న విడుదల అవుతోంది. మూడు రోజుల ముందే తమిళ వెర్షన్ రావడం.. తెలుగు వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించబోతోందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజం కాబోతోంది.
వారిసుకి తమిళ నాట యావరేజ్ టాక్ దక్కింది. కథ, కథనాలు పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయని, ఎమోషన్స్ పేలవంగా సాగాయని, కేవలం పాటలు, రిచ్ ఫ్రేమ్స్ కోసమే సినిమా చూడాలని తమిళ విశ్లేషకులు తేల్చేశారు. ఈ సినిమాని విజయ్ స్టామినా, తనకున్న పాపులారిటీనే కాపాడాలని స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. అన్ని చోట్లా... ఈ సినిమాకి యావరేజ్ టాకే నడుస్తోంది. మరి ఈ టాక్‌తో తెలుగులో నెగ్గుకు రాగలదా? అనేది అనుమానమే. ఎందుకంటే తెలుగులో భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వారసుడు ఇక్కడ రాణించడం అది కూడా యావరేజ్ టాక్ తో.. అనేది సందిగ్థంగా మారింది. తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తే..ఫలితం మరోలా ఉండేదేమో..? మొత్తానికి దిల్ రాజు తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేసినట్టైంది.