స్పోర్ట్స్ డ్రామాలు తెలుగు తెరకు కొత్తేం కాదు. ఈమధ్య అలాంటి కథలు విరివిగా వస్తున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలోనే తెరకెక్కిన `జెర్సీ`కి జాతీయ అవార్డు రావడంతో అలాంటి కథలకు కొత్త ఊపిరి పోసినట్టైంది. ఇప్పుడు తాజాగా... మరో స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. అదే.. `అర్జున్ చక్రవర్తి`. కబడ్డీ నేపథ్యంలో సాగే కథ ఇది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుతున్నారు. విజయ్ రామరాజు కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. వేణు దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. ఇదో ఛాంపియన్ కథ అనీ, 1960 నుంచి 1980 వరకూ సాగే కథ అని, పిరియాడిక్ డ్రామా కావడం వల్ల... దేశ వ్యాప్తంగా ఉన్న 125 ప్రదేశాల్లో రెండేళ్ల పాటు కష్టపడి షూటింగ్ నిర్వహించామని చిత్రబృందం చెబుతోంది.
``గెలుపులన్నీ మసకబారిన, పతకాలన్నీ నేలరాలిన, కన్నీళ్లన్నీ సంద్రాలైన, జ్ఞాపకాలన్నీ నీకై ఎదురు చూసే.. రారా అర్జున... అడుగే, పిడుగై.. ఓటమే ఓడేలా కదలి రారా అర్జున`` అనే డైలాగ్ ఈ టీజర్ లో వినిఇపంచింది. `జెర్సీ` ప్రభావం ఈ సినిమాపై ఉందేమో అనిపించేలా టీజర్ ఉంది. ఈ రెండింటిలోనూ... హీరో పేరు అర్జునే. రైల్వే స్టేషన్‌లో.. అర్జున్ బిగ్గరగా అరిచే షాట్ `జెర్సీ`లో గూజ్ బమ్స్ తెప్పించింది. అలాంటి షాటే.. `అర్జున్ చక్రవర్తి`లోనూ కనిపించింది.