ఓటీటీ - థియేటర్ మధ్య గట్టి పోటీ నెలకుంది. థియేటర్లో సినిమాలు విడుదల చేసుకోవడం కష్టమైన నేపథ్యంలో చాలామంది నిర్మాతలు ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే... ఎగ్జిబీటర్లు మాత్రం ఓటీటీ అంటే పైర్ అయిపోతున్నారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ల కడుపులు కొట్టొద్దని, థియేటర్ వ్యవస్థని నాశనం చేయొద్దని వేడుకుంటున్నారు. ఆమధ్య నాని సినిమాలు వరుసగా ఓటీటీలో విడుదలైతే... నానిని బ్యాన్ చేస్తామని ఎగ్జిబీటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందుకే శ్యామ్ సింగరాయ్ ని ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేశాడు నాని.
తమిళ నాట కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. మరీ ముఖ్యంగా సూర్య నటించిన కొన్ని సినిమాలు ఓటీటీకి వెళ్లిపోయాయి. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ ఓటీటీలో విడుదల అవ్వడం పట్ల ఎగ్జిబీటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సూర్య ఎవరినీ కేర్ చేయలేదు. ఇప్పుడు విక్రమ్ కూడా అదే బాట పట్టాడు. విక్రమ్ తాజా చిత్రం `మహాన్`. ఇందులో విక్రమ్ తనయుడు థృవ్ కూడా నటించాడు. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు. చివరికి అమేజాన్ ప్రైమ్ కి ఇచ్చేశారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా అమేజాన్ లో నేరుగా విడుదల కానుంది. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయకపోవడం పట్ల తమిళ ఎగ్జిబీటర్లు విక్రమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే విక్రమ్ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. తమిళనాడులో థియేటర్లు ఇంకా పూర్తిగా తెరచుకోలేదు. జనం కూడా థియేటర్ల దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. పైగా విక్రమ్ కి చాలా ఏళ్లుగా హిట్టు లేదు. అందుకే ఓటీటీ రూపంలో మంచి బేరం వచ్చింది. సినిమాని ఇచ్చేశారు. ఆ రకంగా నిర్మాతల్ని విక్రమ్ సేవ్ చేసినట్టే లెక్క.