కంచె సినిమాలో పద్దతిగా కనిపించింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమాతో తనకు టాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ... నిరూపించుకున్నదే లేదు. పైగా.. హిట్లు లేకపోవడం వల్ల ఎంత త్వరగా వచ్చిందో, అంతే త్వరగా సైడ్ అయిపోయింది. `అఖండ`లో ప్రగ్యాని కథానాయికగా ఎంచుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఫామ్ లో లేని ప్రగ్యాని ఎందుకు తీసుకున్నారు? అంటూ నొసలు చిట్లించారు. కానీ మరో ఆప్షన్ లేకపోవడం వల్ల ప్రగ్యాని తీసుకోవాల్సివచ్చింది. అయితే అఖండ హిట్ అవ్వడంతో ప్రగ్యాకి మళ్లీ టాలీవుడ్ లో ద్వారాలు తెరచుకున్నట్టైంది. ఈ హిట్టుని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ప్రగ్యా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
అఖండ హిట్ తరవాత.. ప్రగ్యాకు అదిరిపోయే ఆఫర్లేం రాలేదు. కాకపోతే... నిదానంగానైనా సరే, టాలీవుడ్ పై పట్టుతెచ్చుకోవాలని అనుకుంటోంది ప్రగ్యా. ఓ హిట్ తరవాత సాధారణంగానే పారితోషికం పెంచేస్తారు. లేని పోని డిమాండ్లు చేస్తారు. షరతులు పెడుతుంటారు. కానీ ప్రగ్యా ఇవేం చేయడం లేదట. పారితోషికం ఎంతైనా ఫర్వాలేదు, కథ నచ్చితే చేసేస్తా.. అంటోందట. ఈ లెక్కన ప్రగ్యాకి రెండు మూడు సినిమాలైనా చేతికి దక్కడం ఖాయం. అయితే అందులో కనీసం ఒక్క హిట్టయినా పడాలి. అప్పుడే ప్రగ్యా ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతుంది. మరోవైపు ఐటెమ్ సాంగులొచ్చినా చేయడానికి రెడీ అంటోందట ప్రగ్యా. మరి అలాంటి ఆఫర్లు ఎవరైనా ఇస్తారేమో చూడాలి.