టాలీవుడ్ స్థాయి రోజు రోజుకీ పెరుగుతోంది. బడా హీరో సినిమా అంటే మినిమం 200 కోట్లు ఉండాల్సిందే. ప్రభాస్ లాంటి వాళ్లకైతే 400 కోట్లు పెట్టడానికి రెడీ అంటున్నారు. స్టార్ హీరో సినిమా కోసం బాలీవుడ్ నుంచి తారల్ని దిగుమతి చేస్తున్నారు. బాలీవుడ్ వాళ్లు సైతం.. తెలుగు సినిమా అనగానే, ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం కూడా భారీ హంగులు సిద్ధం అవుతున్నాయన్నది టాలీవుడ్ టాక్.
చిరు కథానాయకుడిగా `లూసీఫర్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకుడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. చిరు చెల్లాయిగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రావాల్సివుంది. మరోవైపు ఈ సినిమాలో ఇంకో హీరోకి ఛాన్స్ వుంది. సినిమా చివర్లో వచ్చే కీలక పాత్ర అది. తమిళంలో పృథ్వీరాజ్ చేశాడు. ఇప్పుడు ఆ పాత్ర కోసం ఎవరిని ఎంచుకోవాలన్న విషయంలో చిత్రబృందం మల్లగుల్లాలు పడుతోంది. ఆ ఛాన్స్ బన్నీ లేదా సాయిధరమ్ తేజ్ కి రావొచ్చని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు చిత్రబృందం ఆలోచన మారింది. ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్, లేదంటే విక్రమ్ లలో ఒకరిని ఎంచుకోవాలని భావిస్తున్నార్ట. అయితే ఇప్పటి వరకూ ఇది కేవలం పరిశీలనలో ఉన్న అంశం. విక్రమ్ ని అడిగితే కాదనడు. సల్మాన్ కీ చిరు కుటుంబానికీ మంచి దోస్తీ ఉంది. తను కూడా ఓకే అంటాడు. మరి చిరు గురి ఎవరిపై ఉందో. ఇద్దరిలో ఎవరు చేసినా లూసీఫర్ కి పిచ్చ క్రేజ్ రావడం ఖాయం.