ఖైది నెం.150 తరవాత వినాయక్ నుంచి సరైన సినిమా రాలేదు. ఆయనకి అదృష్టం కూడా ఏమాత్రం కలసి రాలేదు. హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లి ఆగిపోయింది.
ఛత్రపతి రీమేక్... నత్త నడక నడుస్తోంది. ఈ దశలో మరోసారి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకొంటున్నాడు వినాయక్. ఈసారి గురి తప్పకూడదన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కథ సిద్ధమైంది. అతి త్వరలోనే ఈ చిత్రానికి క్లాప్ కొడతారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా తనే.
ఛత్రపతి ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక... ఈ సినిమాని మొదలెట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈతరం టాప్ హీరోలందరితోనూ పనిచేశాడు వినాయక్. వాళ్లందరికీ హిట్లు ఇచ్చాడు కూడా. అందరితోనూ మంచి అనుబంధం ఉంది. అందుకే వీళ్లందరినీ వాడుకోవాలని భావిస్తున్నాడు.
తన సినిమా ఓపెనింగ్ కి స్టార్సందరికీ తీసుకొచ్చి... హంగామా చేయాలని చూస్తున్నాడు. అంతే కాదు.. ఇందులో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఈ పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తాడని తెలుస్తోంది. చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ ఈ ముగ్గురిలో ఒకరు.. కచ్చితంగా ఈ గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎవరు ఓకే చెప్పినా.. వినాయక్ సినిమాకి ఓ రేంజులో పబ్లిసిటీ వచ్చేసినట్టే.