ఈమధ్య దర్శకుడు తేజ 'పుష్ప' సినిమాపై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు. 'పుష్ప' ని అందరూ హిట్ అనుకొంటున్నారని, అయితే దానికి లాభాలు రాలేదని, అందరూ యావరేజ్ గా చెప్పిన 'రాదేశ్యామ్' సినిమాకి మాత్రమే లాభాలొచ్చాయని, ఓ థియేటర్ లెక్కల్ని ఉదాహరణగా చూపించారు. దాంతో... అల్లు అర్జున్ ఫ్యాన్స్ తేజపై ఓ రేంజ్ లో చెలరేగిపోయారు. దేశమంతా హిట్ అంటున్న పుష్పని పట్టుకొని - ఫ్లాప్ అని ఎలా అనగలుగుతున్నావ్? అంటూ ప్రశ్నించారు. దీనిపై తేజ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
''పుష్ప సమయంలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. అందుకే దానికి రావాల్సిన వసూళ్లు రాలేదు. మరో యావరేజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచేశారు. దాంతో... సినిమా కొన్నవాళ్లకు డబ్బులు మిగిలాయి. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల.. పుష్పకి రావాల్సిన వసూళ్లు రాలేదు. టికెట్ రేట్లు పెంచడం వల్ల ఓ యావరేజ్ సినిమా హిట్టయ్యింది'' అంటూ ఇంకొంచెం క్లారిటీ ఇచ్చారు. తనకు సుకుమార్ అంటే చాలా ఇష్టమని, సుకుమార్ ఏం తీసినా నచ్చేస్తుందని సుక్కు ఫ్యాన్స్ ని సైతం కూల్ చేసే ప్రయత్నం చేశాడు తేజ. ''ఓ సినిమా హిట్టూ, ఫ్లాపుల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను తీసిన సినిమాల్నీ హిట్టు కాలేదు. ఫ్లాపూ కాలేదు. అందుకే నేను మాట్లాడకూడదు'' అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.