'అభిమన్యుడు' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు విశాల్. ఇప్పుడు తన దృష్టంతా 'పందెంకోడి 2'పైనే ఉంది. పందెంకోడి అప్పట్లో సూపర్ డూపర్ హిట్. విశాల్‌కంటూ ఓ దారి వేసింది ఆ సినిమానే. దానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కీర్తి సురేష్‌కి వచ్చిన కొత్త ఈమేజ్, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా మారాయి.
తెలుగులోనూ ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ వచ్చింది. అయితే... విశాల్ గత సినిమాల ఫ్లాపులు ఇప్పుడు గుదిబండగా మారాయి. 'అభిమన్యుడు' మినహాయిస్తే... విశాల్ గత చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టినవే. ఆ సినిమాలన్నీ బయ్యర్లను తీవ్రంగా నష్టపోయేలా చేశాయి. ఇప్పుడు ఆ సినిమాల బాకీ తీర్చాల్సిన బాధ్యత విశాల్‌పై పడింది. ఆ అప్పులన్నీ దాదాపుగా రూ.20 కోట్ల వరకూ ఉంటాయని సమాచారం. వాటిని తీరిస్తే తప్ప `పందెం కోడి 2`కి క్లియరెన్స్ దొరికేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విశాల్ రూ.20 కోట్లు తీర్చేస్తాడనుకోవడం అత్యాసే. రూపాయికి కనీసం పావలా వేసుకున్నా దాదాపుగా రూ.5 కోట్ల వరకూ సెటిల్ చేస్తే గానీ `పందెం కోడి 2`కి క్లియరెన్స్ దొరికే ఛాన్స్ లేదు. `పందెంకోడి 2` కమర్షియల్‌గా తెలుగులో బాగా ఆడితే దాదాపు రూ.10 కోట్ల వరకూ వచ్చే ఛాన్సుంది. అందుకోసం ఇప్పుడు రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టాలన్నమాట.
మరి విశాల్ ఏం చేస్తాడో చూడాలి.