విశ్వక్ సేన్ కొత్త సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా విశ్వక్ సేన్ ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. విశ్వక్ సేన్ కార్ లో వస్తుంటే ఓ కుర్రాడు కారుని అడ్డగించి హంగామా సృష్టించడం ఈ ఫ్రాంక్ కంటెంట్. సినిమాలో హీరో పాత్రని ఉద్దేశించి ఒక ఫ్యాన్ ఫ్రాంక్ గా దిన్ని షూట్ చేశారు. ఐతే నడి రోడ్డుపై హంగామా చేయడంపై కొందరు విమర్శించారు. అయితే ఇక్కడే టీవీ9 ఎంటరైయింది. 'పిచ్చికి కూడా హద్దు వుండాలి భయ్యా' అని ఒక ప్రోగ్రాం చేసింది. దేవి నాగవల్లి దీనికి యాంకర్. విశ్వక్ సేన్ ని కూడా పిలిచారు. మాటలో మధ్యలో విశ్వక్ ని పాగల్ సేన్ అని తక్కువ చేసి రచ్చగొట్టే ప్రయత్నం చేసింది యాంకర్ దేవి. దీంతో విశ్వక్ కూడా తన టెంపర్ చూపించాడు. నా పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని గట్టిగా రివర్స్ అయ్యాడు.
దీంతో దేవి... ఒక్కసారిగా 'గెట్ అవుట్' అని అరిచింది. నా స్టూడియో నుంచి వెళ్ళిపో అని తెగ గొడవ చేసింది. అయితే 'మీరు పిలిస్తే వచ్చా.. మీకు గెట్ అవుట్ అనడం ఏంటి ? అని ప్రశ్నించాడు విశ్వక్. ఈ ప్రశ్నలో లాజిక్ వుంది. స్టూడియో కి పిలిచి ఓ గెస్ట్ తో ఇలా శ్రుతి మించి, మర్యాద మరిచి మాట్లాడటం గౌరవం కాదు. నిజానికి టీవీ 9 ధోరణి మొదటి నుంచి ఇదే. వైరల్ కంటెంట్ కోసం స్టూడియోల్లో లేనిపోని హంగామా చేయడం టీవీ9కి అలవాటే. కావాలన్నట్టు పిలిచి.. వైరల్ వీడియో కోసం గెట్ అవుట్ అన్నట్టగా వుంది టీవీ9 వ్యవహారం. ఈ ఎపిసోడ్ పై సోషల్ మీడియా లో అభిప్రాయాలు గమనిస్తే టీవీ9 నే నెటిజన్స్ తప్పుపట్టారు. ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.