విశ్వక్‌సేన్ కి ప్రొఫెషనలిజం లేదని, తనతో సినిమా తీసే ప్రసక్తే లేదని నట దర్శకుడు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. అర్జున్‌కి సారీ చెబుతూనే... తాను సలహాలు సూచనలు ఇస్తే, తీసుకోలేదని, కళ్లు మూసుకొని కాపురం చేయాల్సిన అగత్యం తనకు లేదని, అందుకే సినిమా వదులుకొన్నానని క్లారిటీ ఇచ్చాడు.
''కలిసి పనిచేసే వాతావరణం అంటే నాకిష్టం. ప్రతీ సినిమానీ నా సినిమానే అనుకొంటా. నా సినిమా బాగా రావాలన్న తపనతో... కొన్ని మార్పులూ చేర్పులూ సూచించా. కానీ అర్జున్ అది స్వీకరించలేదు. షూటింగ్ కి వెళ్లే రోజు కూడా.. వెళ్లిపోదామనే డిసైడ్ అయ్యా.. కానీ... ఆ రోజు ఎందుకో భయం వేసింది.
షూటింగ్ కి వెళ్లేటప్పుడు... ఎప్పుడూ అలా అనిపించలేదు. అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేయండి.. కూర్చుని మాట్లాడుకొని, కొన్ని విషయాలు చర్చించుకొని, అప్పుడు మొదలెడదాం` అని మెసేజ్ పెట్టా. ఆ తరవాత అర్జున్ మేనేజర్ ఫోన్ చేసి `మాట్లాడుకోవడాలేం లేవు.. అడ్వాన్సు తిరిగి పంపించేయండి` అన్నారు. నేను ప్రతీ సినిమానీ నా సినిమా అనే పని చేస్తా.. సినిమా ప్రచారం కోసం కష్టపడతా. ఇప్పటి వరకూ నాతో పనిచేసిన ఏ నిర్మాతా రూపాయి కూడా నష్టపోలేదు. ఒక్క నిర్మాత అయినా, ఆఖరికి సెట్ బోయ్ అయినా నేను ప్రొఫెషనల్ కాదంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా. అర్జున్ గారిపై నాకు చాలా గౌరవం ఉంది. ఆఖరి నిమిషంలో మెసేజ్ పెట్టడం నా తప్పే. కానీ.. నాలుగు రోజుల తరవాత ఆ మాట చెబితే... షూటింగ్ మొదలైన రోజు చెప్పకపోయావా? అంటారు. నేను కొంచెం లేటుగా రియలైజ్ అయ్యా. అర్జున్ గారికీ, ఆయన సినిమాకీ అంతా మంచే జరగాలి'' అని రిప్లై ఇచ్చాడు విశ్వక్.