ఎంత మంచి సినిమా తీశామన్నది కాదు.. ఆ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేశామన్నది ముఖ్యం. రిలీజ్ డేట్ విషయంలో... జాగ్రత్తలు తీసుకోకపోతే, కొంపలు మునిగిపోతాయి. `మంచి సినిమానే కానీ.. రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేశాం` అని ఆ తరవాత నిర్మాతలు లబోదిబోమనాల్సి ఉంటుంది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో తప్పు చేయకూడదు.
అయితే విశ్వక్ సేన్ మాత్రం... ఇవేం పట్టించుకోకుండా తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. విశ్వక్ కొత్త సినిమా `అశోకవనంలో అర్జున కల్యాణం`. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఓ వారం ఆగి... 30న తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా నిర్మాతలు రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. కేజీఎఫ్ హవాని తట్టుకోలేమో అని... ఓ వారం వెనుక అడుగు వేయడం మంచిదే. కానీ.. ఏప్రిల్ 29న చిరు `ఆచార్య` వస్తోంది. అంటే.. ఈ రెండు సినిమాలకూ మధ్య గ్యాప్ ఒకే ఒక్క రోజు. యశ్‌కి బలికావొద్దని.. చిరుకి దొరికిపోయినట్టుంది.. విశ్వక్ పరిస్థితి. చిరు సినిమాకి పోటీగా దిగాలంటే పెద్ద పెద్ద హీరోలే ఆలోచిస్తారు. అలాంటి విశ్వక్ ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అనిపిస్తోంది. చిరుతో పోటీ పడి విశ్వక్ రిస్క్ చేస్తున్నాడని టాలీవుడ్ లో ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. రిలీజ్ డేట్ విషయంలో మరోసారి పునరాలోచించుకోవడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. మరి విశ్వక్ ఏం చేస్తాడో?