కేజీఎఫ్ 2 రికార్డుల వేట మొదలైంది. తొలి రోజు.. బాక్సాఫీసుని షేక్ చేసిన కేజీఎఫ్ 2.. రెండో రోజూ అదే జోరుని కొనసాగించింది. కేజీఎఫ్ దూకుడు చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అనిపిస్తోంది. నిజానికి ఇదంతా కేజీఎఫ్ నుంచి వచ్చిన హైపే. చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్టవ్వడం వల్ల పార్ట్ 2పై ఆసక్తి పెరిగింది. అంతే తప్ప.... కేజీఎఫ్ 2 టీమ్ నుంచి తీసుకొచ్చిన హైప్ కాదిది.
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పబ్లిసిటీ చాలా కీలకం. కేజీఎఫ్ 2 అంతటి భారీ చిత్రానికి పబ్లిసిటీ కోసం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.కానీ... చిత్రబృందం ఈ సినిమా పబ్లిసిటీ కోసం కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ కేటాయించింది. హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒకే ప్రెస్ మీట్ నిర్వహించింది. మిగిలిన చోట్ల కూడా తూతూ మంత్రంలాంటి ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లూ పెట్టింది. కేజీఎఫ్ 2 తీరు చూస్తుంటే.. అసలు వీళ్లకి ఈ సినిమాపై ఆశల్లేవా? అనిపించేంత నీరసంగా సాగాయి ప్రమోషన్ కార్యక్రమాలు. అయితే ఇవేం వసూళ్లపై ప్రభావం చూపించలేదు. తొలి రోజు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కించుకుంది ఈ సినిమా. దాన్ని బట్టి.. చేసే పబ్లిసిటీకీ, వచ్చే క్రేజ్‌కీ... ఏమాత్రం సంబంధం లేదన్న విషయం అర్థమైంది. ఆర్.ఆర్.ఆర్ అలా కాదు. ప్రమోషన్లు భారీగా చేశారు. అందుకోసం బాగా ఖర్చు పెట్టారు కూడా. బాలీవుడ్ లో కొన్ని ఛానళ్లకు పెయిడెడ్ ఇంటర్వ్యూలు ఇచ్చి, క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే అవేం చేయకుండా కేజీఎఫ్ అక్కడ సత్తా చాటడం విశేషం.