టాలీవుడ్‌లో బాగా సెటిలైపోయిన దర్శకులలో వినాయక్ ఒకరు. ఆయన బాగా ఫామ్ లో ఉన్నప్పుడు డబ్బంతా రియల్ ఎస్టేట్స్ లో పెట్టారు. ఓ థియేటర్ కూడా కొన్నారు. ఇప్పుడు అవి చూసుకున్నా సరిపోతుంది. అందుకనేనేమో వినాయక్ బాగా రిలాక్స్ అయిపోయారు. `ఇంటిలిజెంట్` తరవాత మరో సినిమా కోసం కొన్నాళ్లు ఆయన ప్రయత్నం చేశారు. బాలయ్య తో సినిమా దాదాపు పక్కా అన్నారు. కానీ అది కుదర్లేదు. ఆ తరవాత వినాయక్ కి హీరోగా ఛాన్స్ వచ్చింది. అదీ దిల్‌రాజు బ్యానర్‌లో. దిల్‌రాజుని నిర్మాతగా నిలబెట్టింది వినాయక్ అయితే, వినాయక్ ని ఇప్పుడు హీరోగా నిలబెట్టి దిల్ రాజు తన కృతజ్ఞత చూపించుకుంటున్నాడు.
అయితే.. వినాయక్ దర్శకుడిగా ప్రయత్నాలు పూర్తిగా ఆపేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈమధ్య వినాయక్ - రామ్ కలసి ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. అయితే అది కేవలం రూమర్ అని తేలిపోయింది. వినాయక్ - విజయ్ దేవరకొండ కాంబో అని కూడా అన్నారు. అయితే అందులోనూ నిజం లేదని తెలిసింది. ఇటీవల వినాయక్ దగ్గరకు సి. కల్యాణ్ రెండు మూడు కథల్ని తీసుకెళ్లార్ట. కానీ వినాయక్ మాత్రం `ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం లేదు` అని తెగేసి చెప్పాడట. వినాయక్ అడ్వాన్సు తీసుకున్న నిర్మాతలో సి.కల్యాణ్ ఒకరు.
`ఇంటిలిజెంట్` నష్టాల్ని భరించడానికి ఓ సినిమా చేస్తానని వినాయక్ ఒప్పుకున్నారు. అయితే వినాయక్ మాత్రం డైరెక్షన్‌ని కొన్నాళ్లు పక్కన పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈలోగా ఆయన దృష్టి దిల్‌రాజు సినిమాపై పడిందని, అందుకు సంబంధించిన మేకొవర్‌లో వినాయక్ ఉన్నారని, అందుకే డైరక్షన్ గురించి పట్టించుకోకుండా రిలాక్స్ అవుతున్నాడని తెలుస్తోంది. అక్టోబరు 9న వినాయక్ హీరోగా సినిమాపట్టాలెక్కబోతోంది. ఆ సినిమా విడుదలైనంత వరకూ వినాయక్ దృష్టి నటనపైనే.