సాహో వెళ్లాక.. చిన్న సినిమాలకు కాస్త స్పేస్ దొరికింది. అక్టోబరు వస్తే సైరా హడావుడి ఉంటుంది. అందుకే ఈలోగా వీలైనన్ని సినిమాల్ని వదలడానికి దర్శక నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చేవారం గ్యాంగ్ లీడర్, మరుసటి వారం వాల్మీకి ఉండడంతో - చిన్న సినిమాల జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ వారం ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో కాస్తో కూస్తో అటెన్షన్ తెచ్చుకున్న సినిమా జోడీ. ఎందుకంటే ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. `జెర్సీ`తో కథానాయికగా మెప్పించిన శ్రద్దా శ్రీనాధ్ కథానాయికగా నటించింది. అందుకే ఈ సినిమాపై దృష్టి పడింది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడంతో - ఈ సినిమా వస్తోందన్న విషయమే చాలా మందికి తెలీలేదు. తీరా విడుదలయ్యాక కథలో, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో - తొలి షోకే ఫ్లాప్ టాక్ మూట తెచ్చుకుంది.
ఆదికి మరో పరాభవం ఇది. నటుడిగానూ ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. జెర్సీలో చూపించిన అభినయ ప్రదర్శనలో పది శాతం కూడా ఈ సినిమాలో కనబరచలేకపోయింది శ్రద్ద. సాహో దెబ్బకు థియేటర్లు దొరకడమే గగనం అనుకుంటే, దొరికిన థియేటర్లలో జనం లేక జోడీ విలవిలలాడుతోంది. ఇక మిగిలిన సినిమాల పరిస్థితి సరే సరే. ఈ డేట్ దాటితే మరో మంచి రోజు దొరకదన్నట్టు ఉండిపోరాదే, తారామణి, టూ అవర్స్ సినిమాలొచ్చేశాయ్. కాకపోతే.. సాహో దెబ్బకు ఇవన్నీ కుదేలైపోయాయి. జనమంతా సాహో గురించీ, అందులోని తప్పొప్పుల గురించీ, ఆ సినిమా సాధిస్తున్న వసూళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. మరో సినిమాపై ఫోకస్ చేసే మూడ్ కూడా లేదు. అందుకే... ఈ సినిమాలన్నీ సోదిలో లేకుండా పోయాయి.