ఈ మధ్య వి.వి.వినాయక్ పేరు వినిపించడం లేదెక్కడ. `ఇంటిలిజెంట్ `సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తన కెరీర్‌పై చాలా ప్రభావం చూపించింది. అంతకు ముందే `ఖైదీ నెం.150`లాంటి సూపర్ హిట్ ఇచ్చినా సరే... అందరూ `ఇంటిలిజెంట్` ఫ్లాప్ గురించే మాట్లాడుకున్నారు. ఆ తరవాత.. హీరోగా ఓసినిమా మొదలవ్వడం, ఆగిపోవడం.. ఇవన్నీ వినాయక్‌కు ప్రతికూలంగా మారాయి. అయితే ఇప్పుడు సడన్ గా మళ్లీ వినాయక్‌పై ఫోకస్ పడింది. `లూసీఫర్` రీమేక్‌ని వినాయక్ చేతిలో పెట్టాడు చిరంజీవి.
ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఈలోగా నందమూరి బాలకృష్ణ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. `ఇంటిలిజెంట్` తరవాత బాలయ్యతో ఓ సినిమా చేయాలని తెగ ప్రయత్నించాడు వినాయక్. కథా చర్చలు కూడా జరిగాయి. కానీ చివరి క్షణాల్లో కాంబినేషన్ సెట్టవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు బాలయ్య నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. బోయపాటి సినిమా పూర్తవ్వగానే వినాయక్ సినిమా మొదలెట్టాలన్న ఆలోచనలలో ఉన్నాడు బాలయ్య.
ఈ లోగా లూసీఫర్ పూర్తవుతుందా, లేదంటే... బాలయ్య సినిమా అయ్యాకనే లూసీఫర్ మొదలవుతుందా అనేదే తేలాలి. మొత్తానికి అటు చిరుతో, ఇటు బాలయ్యతో .. ఒకేసారి డబుల్ బొనాంజా కొట్టేశాడు వినాయక్. ఇక వినాయక్ టైమ్ మొదలైనట్టే.