ఈవారం బాక్సాఫీసు దగ్గరకు మూడు సినిమాలొచ్చాయి. `చావు కబురు చల్లగా`, `మోసగాళ్లు`, `శశి` ప్రేక్షకుల తీర్పు కోరుతూ.. థియేటర్లలో ప్రత్యక్షం అయ్యాయి. దురదృష్టవశాత్తూ.. మూడు సినిమాలకూ డిజాస్టర్ టాక్ వచ్చింది. మూడు సినిమాల నిర్మాతలూ, బయ్యర్లు కష్టాల్లో పడ్డారు. అలా ఈ ఫ్రైడే.. టాలీవుడ్ కి డ్రై డేగా మారిపోయింది.
తొలి మూడు రోజుల్లో కాస్త `చావు కబురు చల్లగా`నే బెటర్ పెర్‌ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి. ఈ వీకెండ్ లో దాదాపు 2.6 కోట్లు తెచ్చుకుంది సినిమా. కాకపోతే... 13 కోట్ల రూపాయలు రాబట్టాల్సివుంది. అది అసాధ్యం. సో... గీతా ఆర్ట్స్ 2 భారీ నష్టాలు చవిచూడాల్సిందన్నమాట. ఇక 20 కోట్ల వ్యయంతో రూపొందిన `మోసగాళ్లు` తొలి వారాంతంలో 60 లక్షలు కూడా తెచ్చుకోలేకపోయింది. కాజల్, సునీల్ శెట్టి లాంటి స్టార్లు ఉన్నా ఈ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. దాంతో విష్ణు ఖాతాలో మరో అట్టర్ ఫ్లాప్ చేరిపోయినట్టే.
ఇక శశి పరిస్థితి ఇంకా దారుణం. ఒకే ఒక లోకం నువ్వే అనే పాటతో.. ఈ సినిమా కాస్త ట్రెండ్ లో నిలిచింది. అయితే ఆ పాట మినహా సినిమాలో ఏం లేదని తేలిపోయింది. తొలి మూడు రోజులకూ ఈ సినిమా 40 లక్షలు కూడా తెచ్చుకోలేదు. థియేటర్ రిలీజ్ హక్కుల్ని 2.5 కోట్లకు అమ్మిన ఈసినిమాకి 40 లక్షలు రాలేదంటే.. ఇక ఏమనుకోవాలి..? మొత్తానికి మూడు సినిమాలూ తీవ్రమైన నిరాశనూ, నష్టాన్ని మిగిల్చి - ఈ వీకెండ్ వినోదం అంటూ లేకుండా చేసేశాయి.