ఈ రోజుల్లో పాజిటీవ్ కంటే నెగిటీవ్ విషయమే ఎక్కువ స్ప్రెడ్ అవుతోంది. పాజిటీవ్ విషయంలోంచి కూడా నెగిటివిటీ బయటకు లాగుతున్నారు. చిరంజీవి విషయంలో ఇదే జరుగుతోంది. నిన్న చిరు - తన తల్లి కోసం చేపల ఫ్రై చేసి, అందుకు సంబంధించిన ఓ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. చింతకాయ తొక్కుతో చేసిన చిన్న చేపల ఫ్రై అంటే తన తల్లికి చాలా ఇష్టమని, అదే వండి పెట్టాడు చిరు. తల్లిపై చిరు చూపించిన ప్రేమ చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోయారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.
అయితే.. కొంతమంది మాత్రం చిరుని వేలెత్తి చూపిస్తున్నారు. సోనూసూద్ ని చూసి నేర్చుకోమని సుద్దులు నేర్పుతున్నారు. సోనూసూద్ పేదవాళ్లకు, వలస కూలీలకు అన్నం పెట్టి వీడియోలు తీస్తుంటే, చిరు చేపల ఫ్రైలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. సోనూసూద్ ని చూసి నేర్చుకోమని హితవు పలుకుతున్నారు. అయితే.. చిరు ని తప్పుపట్టలేం. సమాజసేవ చేయడం లేదనీ అనలేం. ప్రజలకు కష్టం వచ్చిన ప్రతీసారీ నేనున్నా అంటూ ముందుకొచ్చాడు చిరు. కరోనా టైమ్ లో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించాడు. సీసీసీ ఏర్పాటు చేసి.. సినీ కార్మికులకు చేయూత నిచ్చాడు. కొన్ని వీడియోలు చేసి ప్రజల్ని చైతన్య పరుస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా.. చిరు వైపు వేలెత్తి చూపిస్తారా? అన్నది మెగా అభిమానుల ప్రశ్న. చిరు.. చేసినదాంట్లో తప్పేం లేదు. కన్నతల్లికి ప్రేమగా వండి పెట్టడంలో తప్పులు వెదకడం ఏమిటి? ఇది నిజంగా కోడిగుడ్డుపై ఈకలు పీకడం లాంటిదే అన్నది విశ్లేషకుల మాట.