'దర్శకుడిగా నాకో ఆలోచన వచ్చింది. అలాంటి ఆలోచనలు చాలా చాలా వస్తుంటాయి. ఓ సినిమా చేయాలంటే ఆలోచన ఒక్కటే సరిపోదు. చరణ్‌కి ఫస్ట్ కథ చెప్పాను. ఒప్పుకుంటాడని అనుకోలేదు. చరణ్ ఒప్పుకోవడమే పెద్ద షాక్, ఒప్పుకోవడం ఒక్కటే కాదు, సినిమా కోసం ప్రాణం పెట్టేయడానికి సిద్ధమయ్యాడు. చరణ్ కమిట్మెంట్‌తో పాటు, చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కథని నమ్మారు. ఈ కథ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అని ఒక్క క్షణం కూడా అనుకోలేదు వాళ్లు.
ఈరోజుకీ 'రంగస్థలం' సినిమా చేశానా? అనే షాక్‌లోనే ఉన్నాను అంటున్నాడు 'రంగస్థలం' డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే ఆ అభిమానం ఈ సినిమాతో వెయ్యి రెట్లయ్యింది. ఇలాంటి సినిమాతో కూడా రికార్డులు తిరగరాయొచ్చా? అనే అనుమానం కలిగేంతలా 'రంగస్థలం' సినిమాతో తిరుగు లేని విజయాన్ని అందుకున్నాడు. ఇది కేవలం సుకుమార్, సాధించిన విజయం కాదు, యావత్ తెలుగు సినిమా సాధించిన విజయం అంటున్నాడు సుకుమార్.
అందుకే 'థాంక్స్' అనే మాట, చిట్టిబాబు పాత్రతో సినిమాకి ప్రాణం పోసిన చరణ్‌కైనా, కథని నమ్మి బడ్జెట్ పెట్టేందుకు వెనుకాడకుండా పని చేసిన నిర్మాతలకైనా చిన్న మాటే అవుతుందంటున్నాడు. కమర్షియల్ ఆలోచన మాకసలు రాలేదు ఈ సినిమా చేస్తున్నప్పుడు. మంచి సినిమా చేశామన్న తృప్తి కోసమే తపన పడ్డాం. ఆ తృప్తి లభించింది. కమర్షియల్ విజయమూ దక్కింది అని సంతృప్తిగా ఈ సినిమా అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు డైరెక్టర్ సుకుమార్.