సీనియర్ హీరో అర్జున్ అంటేనే ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. ఈ ఏజ్‌లోనూ ఆయన ఫిట్‌నెస్‌ని అంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నటన పట్ల తనకున్న ప్యాషన్, అలాగే తనపై నమ్మకం పెట్టుకున్న దర్శక, నిర్మాతలే కారణం అంటున్నారాయన. యాక్షన్ కింగ్ అర్జున్ అనే టైటిల్‌కి ఆయన కరెక్ట్ ఫిట్ అందుకే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సత్తా చాటిన అర్జున్, ఇప్పుడు విలన్‌గానూ తన విశ్వరూపం చూపించారు. లేటెస్టుగా 'లై' సినిమాతో అర్జున్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ స్టోరీ విన్న వెంటనే విలన్ పాత్ర ఆయనకు బాగా నచ్చిందట. మారు మాట్లాడకుండా ఆ క్యారెక్టర్‌కి ఓకే చెప్పేశారట కానీ, విలన్‌గా తనని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం ఆ తర్వాత ఆయన్ని వెంటాడిందట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అన్ని భయాలు పటాపంచలైపోయాయంటున్నారు అర్జున్. హీరోకి ధీటుగా విలన్ పాత్రని డిజైన్ చేశాడు హను రాఘవపూడి. అందుకే ఆ క్యారెక్టర్ జనానికి అంత బాగా రీచ్ అయ్యింది. తొలి సారిగా ఆయన చేసిన ప్రయోగం ఫలించినందుకు అర్జున్ తెలుగు ఆడియన్స్‌కి కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే,ఆయన దర్శకత్వంలో కూడా తన సత్తా చాటబోతున్నారు. తన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు అర్జున్. మరో పక్క అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు అర్జున్. ఆకలిగా ఉన్నవాడికి కాస్తంత అన్నం పెట్టడంలోనూ దేశ సేవ ఉంది అని చెబుతున్న అర్జున్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు.