రజనీకాంత్ సినిమాలంటే తెలుగులో పిచ్చ క్రేజ్. ఇక్కడి స్టార్ హీరోకు సమానంగా మార్కెట్ ఉంటుంది. అదే స్థాయిలో విడుదల చేస్తారు కూడా. `రోబో 2.ఓ` దాదాపు రూ.80 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. 'పెట్టా' విషయంలోనూ నిర్మాతలు చాలా ఆశలే పెట్టుకున్నారు. తెలుగులో ఈ సినిమాకి మంచి రేటు వస్తుందని ఎదురుచూస్తున్నారు. కానీ... ఈ సినిమా తెలుగులో అనుకున్న సమయానికి విడుదల అవుతుందా, లేదా? అనేదే అసలు ప్రశ్న.
ఎందుకంటే.. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్నది నిర్మాతల ఉద్దేశం. తమిళంలో సంక్రాంతినాడే వస్తోంది. అయితే తెలుగులో సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. ఎన్టీఆర్, ఎఫ్ 2, వినయ విధేయ రామ సంక్రాంతికే వస్తున్నాయి. వాటి మధ్య `పెట్టా`కి స్థానం దొరక్కపోవొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి కీలకమైన సీజన్లలో డబ్బింగ్ సినిమాల్ని అనుమతించకూడదని నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది.
గత కొన్నేళ్లుగా దాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో `పెట్టా`ని అడ్డుకోవాలని భావిస్తున్నార్ట. నిర్మాతలంతా ఏకమైతే.. `పెట్టా` తెలుగులో విడుదల అవ్వదు. తెలుగులో కోసం తమిళ విడుదల తేదీని మార్చుకుంటారా, లేదా? ముందు తమిళంలో ఈ సినిమాని విడుదల చేసి, ఆ తరవాత తెలుగులోకి తీసుకొస్తారా అనేది ఆ నిర్మాతల చేతుల్లో ఉంది.