ఈవారం బాక్సాఫీసు కొత్త సినిమాలతో కళకళలాడింది. ఒకేసారి 4 సినిమాలు వచ్చాయి. అందులో రెండు తెలుగు సినిమాలు, మరో రెండు డబ్బింగ్ సినిమాలు. పడి పడి లేచె మనసు, అంతరిక్షం, కేజీఎఫ్, మారి 2 ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి... ఈ సినిమాల ఫలితం ఏమిటి? బాక్సాఫీసు దగ్గర నిలబడి, వసూళ్లు రాబట్టుకోగలిగే సత్తా దేనికి ఉంది?
ముందుగా అంతరిక్షం గురించి చెప్పుకోవాలి. ఘాజీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంకల్ప్ రెడ్డి చేసిన మరో ప్రయత్నమిది. కంచెలాంటి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించాడు. అంతరిక్షం నేపథ్యంలో తెలుగులో వచ్చిన తొలి చిత్రమిది. కాబట్టి.. అందరి ఫోకస్ ఈ సినిమాపై పడింది. సంకల్ప్ మరోసారి రొటీన్ కి భిన్నమైన కథనే ఉంచుకున్నాడు. ఓ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించాడు. కాకపోతే... కథనం చాలా స్లో. ఇందులోని టెర్మినాలజీ అంత తేలిగ్గా అర్థం కాదు. సైన్స్ పాఠంలా సాగిన సెకండ్ ఆఫ్... కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల తీర్పుపైనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆశించినన్ని వసూళ్లు రాకపోవడం అతి పెద్ద మైనస్.
శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన `పడి పడి లేచె మనసు` యువ ప్రేక్షకుల హృదయాల్ని ఆకట్టుకోవడంలో కొంతమేర సఫలీకృతం అయ్యింది. ఈవారం విడుదలైన నాలుగు చిత్రాల్లో ఈ చిత్రానికే ఓపెనింగ్స్ లభించాయి. తొలి రెండు రోజుల్లో దాదాపు 4 కోట్ల షేర్ రాబట్టగలిగింది. తొలి సగంలో లవ్ స్టోరీ, కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడం, విజువల్ గా ఈ సినిమా బాగుండడం, పాటలు నచ్చడంతో... ఓకే అనిపించుకుంది. రెండో సగమే గందరగోళంగా తయారైంది. దర్శకుడు ద్వితీయార్థాన్ని కూడా బాగా రాసుకుని ఉంటే.. ఈ సినిమా మరో మంచి ప్రేమకథగా నిలిచిపోయేది.
ఈ వారం విడుదలైన రెండు డబ్బింగ్ చిత్రాలకు టాక్ అంతంత మాత్రంగానే ఉంది. మారి 2, కేజీఎఫ్‌లకు అసలు పబ్లిసిటీనే దొరకలేదు. థియేటర్లూ తక్కువగానే లభించాయి. రెండింటిలో కేజీఎఫ్‌నే కాస్త బెటర్. తొలి రోజు రూ.50 లక్షల వరకూ రాబట్టింది. మారి 2 కి అదీ లేదు. ధనుష్ సినిమాలంటే తెలుగులో కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. దాన్ని పాడు చేసేసిన సినిమా ఇది. పబ్లిసిటీ లేకుండా ఈ సినిమాని వదిలేయడం.. ఇబ్బంది కలిగించింది.
ఇదీ ఈ వారం ఐక్లిక్ టాక్ ఆఫ్ ది వీక్...