చిరంజీవి మెగాస్టార్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ బిరుదు ఆయనకు ఇచ్చింది మాత్రం... నిర్మాత కె.ఎస్.రామరావు. ఇది వరకు చిరంజీవిని సుప్రిం హీరో అని పిలిచే వారు.కానీ కె.ఎస్.రామారావు ఆయన్ని మెగాస్టార్ అని సంభోదించేసరికి...అదే ఫిక్సయిపోయింది.
అలా పవన్ కల్యాణ్ ని పవర్ స్టార్ చేసిందెవరు? అనే ప్రశ్న తలెత్తక మానదు. తొలి సినిమా అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి సినిమాలో టైటిల్ కార్డులో కేవలం కల్యాణ్ బాబు అనే పడింది. ఆ తరవాత.. పవన్ కల్యాణ్ అయ్యింది. ఆ తరువాతి చిత్రం.. గోకులంలో సీత. ఆ సినిమాకి పోసాని కృష్ణమురళి రచయిత. గోకులంలో సీత ప్రెస్ మీట్ లలో పవన్ ని పోసాని.. పవర్ స్టార్.. పవర్ స్టార్... అని సంబోధించేవారు. అలా పవన్ పేరు ముందు మెల్లగా పవర్ స్టార్ అనే బిరుదు చేరడం మొదలైంది. సుస్వాగతం సినిమాలో తొలిసారి పవన్ పేరు ముందు పవర్ స్టార్ అనే పదం వచ్చి చేరింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ పవన్ కి అది పర్యాయపదమైపోయింది. అలా పవన్ ని పవర్ స్టార్ చేసిన ఘనత మూటగట్టుకున్నారు పోసాని కృష్ణమురళి.