చిరంజీవి `ఆచార్య` ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌనే. ఆ సినిమా ఫ్లాపై వెళ్లిపోయినా... ఆ సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఈ సినిమా వల్ల.. పూర్తిగా ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దర్శకుడు కొరటాల శివనే. భారీ రేట్లకు ఈ సినిమా అమ్మేసినందున... నైజాం, సీడెడ్ లో ఈ సినిమా కొన్నవాళ్లు అడ్డంగా మునిగిపోయారు. వాళ్లకు సెటిల్ చేయాల్సిన బాధ్యత కొరటాలపై పడింది. అందుకోసం తన ఆస్తుల్ని కూడా అమ్మేసినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ... కొరటాల ఆఫీసుపై కొంతమంది బయ్యర్లు దాడి చేసి మరో రూ.6 కోట్లు సెటిల్ చేసుకుని వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ఇదే అదునుగా చేసుకొని కొంతమంది మెగా ఫ్యామిలీని ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. తన సినిమా ఫ్లాప్ అయినా, నిర్మాతనీ పంపిణీదారుల్ని ఆదుకోవడం చిరు బాధ్యత కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కొరటాలకు సైతం చిరు ఆర్థికంగా అండదండలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో.. అసలు ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది? అనే ప్రశ్న మొదలవుతోంది.
ఈ సినిమాకి కొరటాల నిర్మాత కాదు. కాకపోతే.. నిర్మాత నిరంజన్ రెడ్డితో పడలేక, ఆయన అప్పటి వరకూ పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చేసి, ఆర్థికంగా లావా దేవీలన్నీ తన భుజాన వేసుకొన్నాడు కొరటాల. అంటే ఈ సినిమాకి ఓ విధంగా నిర్మాత తనే. కొన్ని ఏరియాలు తన స్నేహితులకే కేటాయించాడు. దాదాపుగా ఆ ఏరియాలన్నీ తన చేతిలో ఉంచుకొన్నట్టే. ఈ సినిమాకి ఎంత ఖర్చయ్యిందో, ఎంతకు అమ్మారో, ఆ లాభాన్ని ఏం చేశారో ఇప్పటి వరకూ కొరటాల చెప్పడం లేదు. థియేటరికల్ నుంచి డబ్బులు రాకపోయినా, నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో బాగానే వచ్చాయి కదా? విడుదలకు ముందు ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకుందని టాక్. అంతేకాదు. సినిమా ఫ్లాప్ అయిన తరవాత చిరు, చరణ్ తమ పారితోషికాల నుంచి రూ.20 కోట్లు వెనక్కి ఇచ్చారని చెప్పారు. అలాంటప్పుడు.. ఆ డబ్బులతో సెటిల్ మెంట్ చేసేస్తే... ఇంత గొడవ వచ్చి ఉండేది కాదు కదా? తమ పారితోషికాల్లోంచి రూ.20 కోట్లు తిరిగి ఇవ్వడం ఆదుకోవడం కాదా? అని ఇప్పుడు చిరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అదీ పాయింటే కదా.? ఈ సినిమా హిట్టయి, మంచి లాభాలొస్తే.. అన్నీ కొరటాల జేబులోకే కదా వెళ్లేవి. ఫ్లాపయినప్పుడు తీసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా తనదే కదా. అలాంప్పుడు చిరుని బ్లేమ్ చేస్తే ఎలా అన్నది మెగా అభిమానుల ప్రశ్న.