ఆస్కార్ వేడుకని కళ్లారా చూడడం, ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అవార్డు అందుకోవడం... తన జీవితంలోనే అపురూపమైన క్షణాలని, వాటిని ఎప్పుడూ మర్చిపోలేని పేర్కొన్నారు ఎన్టీఆర్. ``ఆస్కార్ ఘట్టాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఓ భారతీయుడిగా ముఖ్యంగా తెలుగువాడిగా గర్విస్తున్నా`` అన్నారు ఎన్టీఆర్.
ఆస్కార్ వేడుక తరవాత... ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. విమానాశ్రాయం దగ్గర ఎన్టీఆర్‌కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సుల వల్లే.. నాటు నాటు పాటకు అవార్డు వచ్చిందని, ఈ అవార్డు రావడానికి ప్రోత్సహించిన ప్రతి భారతీయుడికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు వచ్చాక.. తొలి ఫోన్ తన భార్య ప్రణతికే చేశానని, అవార్డు వచ్చిందన్న ఆనందాన్ని తన భార్యతో పంచుకొన్నానని వివరించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈనెలాఖరున షూటింగ్ ప్రారంభం కానుంది.