ఈ దీపావళికి తమిళ సినిమాలే విడుదల అవుతున్నాయి. ఒకటి కార్తి నటించిన `ఖైదీ`. రెండోది విజయ్ నటించిన `విజిల్`. రెండింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఖైదీ ఓ రా సబ్జెక్ట్. నాలుగు గంటల వ్యవధిలో జరిగే ఓ రియలిస్టిక్ డ్రామా. పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ ఖైదీ.. జైలు నుంచి విడుదలై, తన కూతుర్ని చూడ్డానికి వెళ్తుంటాడు. ఆ మధ్య మార్గంలో ఏం జరిగిందన్నదే కథ. తమిళనాడులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథని తెరకెక్కించారు. ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ఇది మాస్ యాక్షన్ డ్రామా. సినిమా అంతా యాక్షన్ మూడ్‌లో ఉండబోతోంది. కార్తి పక్కన హీరోయిన్ లేదు. పాటలూ లేవు. కేవలం కథని నమ్ముకుని రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోబెట్టాలని చూస్తున్నారన్నమాట.
`విజిల్`ది మరో టైపు స్టోరీ. ఇది పూర్తి కమర్షియల్ హంగులతో రూపొందించిన కథ. విజయ్ మూడు పార్శ్వాలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. అందులో ఓ పాత్ర ఫుట్ బాల్ కోచ్. అమ్మాయిల టీమ్‌కి విజయ్ కోచ్‌గా ఉంటాడన్నమాట. చెక్ దే ఇండియా టైపు స్టోరీ అనుకోవొచ్చు. కానీ విజయ్ అభిమానులకు కావల్సిన మాస్, కమర్షియల్ అంశాలన్నీ ఇందులో రూపొందించారు. ఫుట్ బాల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాలూ గ్రాండియర్‌గా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. నయనతార గ్లామర్ మరో ప్రధాన ఆకర్షణ.
తెలుగులో విజయ్ కంటే, కార్తికి ఎక్కువ ఇమేజ్ ఉంది. కాకపోతే... కార్తి హిట్టు కొట్టి చాలా రోజులైంది. ఖాకీ తరవాత కార్తి నుంచి సరైన సినిమా రాలేదు. తుపాకీ తరవాత తన ఇమేజ్, మైలేజీ పెంచుకున్నాడు విజయ్. అట్లీ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. సో.. ఈ కాంబినేషన్ హిట్టు కొట్టే ఛాన్సులే ఎక్కువ. మరి.. దీపావళికి తమిళ టపాసులు వదులుతున్న ఈ ఇద్దరు హీరోలలో విజయ లక్ష్మి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే.. ఇంకొద్ది గంటలు ఆగాలి.