ఏ సినిమాకైనా సరే, హీరోకున్న మార్కెట్ బట్టో, దర్శకుడికి ఉన్న స్టామినాని బట్టో.. బడ్జెట్ డిసైడ్ అవుతుంది. ఆ పరిధిలో సినిమా చేస్తే.. సేఫ్ జోన్‌లో ఉన్నట్టు లెక్క. అది దాటితే డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అయినట్టే. కాబట్టి.. పెట్టుబడి - రాబడి మధ్య ఉన్న తేడాని గుర్తెరిగి నిర్మాతలు సినిమాలు చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ఈ లెక్కలు పక్కన పెట్టేస్తారు. అశ్వనీదత్.. అదే టైపు. వైజయంతీ మూవీస్ అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు. పెద్ద హీరోలతో సినిమాలు తీసిన ప్రతీసారీ.. వైజయంతీ బడ్జెట్ లెక్కల్ని పట్టించుకోలేదు. కాకపోతే.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌ని నమ్మి రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టేశారు. `సీతారామం` కోసం.
దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరో కావొచ్చు. ఆయన చేసిన కొన్ని సినిమాలు తెలుగులో మంచి వసూళ్లని అందుకొని ఉండొచ్చు. కానీ ఇప్పటికీ తను పర భాషా నటుడే. తను తొలిసారి చేసిన స్ట్రయిట్ తెలుగు సినిమా `సీతారామం`. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా.. రూ.45 కోట్లు. దుల్కర్ పై ఇంత పెట్టుబడి పెట్టడం ఓరకంగా దుస్సాహసమే. పైగా.. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకుడు. తను ఎప్పుడు హిట్ ఇస్తాడో, ఎప్పుడు ఫ్లాప్ తో కంగారు పెడతాడో చెప్పలేం. పైగా హను గత చిత్రం `పడి పడి లేచె మనసు` బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ కాంబోపై అశ్వనీదత్... రూ.45 కోట్లు పెట్టడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
అశ్వనీదత్ చేసింది ఓ రకంగా రిస్కే. కాకపోతే... దాని వెనుక చాలా లెక్కలున్నాయి. దుల్కర్ సల్మాన్ పై తెలుగు ప్రేక్షకులకు ఓ భరోసా ఉంది. తనెప్పుడూ మంచి కథలే ఎంచుకొంటాడన్న భరోసా ఉంది. `మహానటి`లో తాను ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాతో దాదాపుగా తెలుగు హీరో... అనిపించేసుకొన్నాడు. పైగా దుల్కర్‌కి సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ `సీతారామం`కి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. హను రాఘవపూడి ప్రతిభపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. కాకపోతే.. అప్పుడప్పుడు తను కంట్రోల్ తప్పుతుంటాడు. అందుకే ఈ కథపై దాదాపు యేడాది పాటు.. కసరత్తు చేశార్ట. స్క్రిప్టులో 70 సన్నివేశాలుంటే.. ఆ 70 సంతృప్తి కరంగా వచ్చేంత వరకూ వెర్షన్లు రాయిస్తూనే ఉన్నార్ట. అన్ని రకాలుగా స్క్రిప్టు ఓకే అనుకొన్న తరవాతే.. ఈ సినిమాని పట్టాలెక్కించారు. ఓ పరభాషా హీరోపై, ఓ ఫ్లాపున్న దర్శకుడిపై అశ్వనీదత్ రూ.45 కోట్ల బెట్ వేశారంటే... అది కేవలం ఈ కథపై ఉన్న నమ్మకమే కారణం. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలూ.. ఈ సినిమాపై క్రేజ్ పెంచాయి. `సీతారామం`పై టాలీవుడ్ లో రోజురోజుకీ ఫోకస్ పెరుగుతూ పోతోంది. తెలుగులో ఈ సినిమాకి ఈ తరహా క్రేజ్ రావడం ఒక ఎత్తయితే, మలయాళ ప్రేక్షకులు దానికి మించి ఆశలు పెట్టుకొన్నారు. ప్రేమకథలు తీయడంలో... హను స్టైల్ వేరు. సరైన ట్రాక్ లో వెళ్తే.. అద్భుతాలు సృష్టించగలడు. ప్రేమ... అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ఏ భాషలో అయినా, ప్రేక్షకుల్ని ఇట్టే ఆకర్షించే మహత్తు లవ్ స్టోరీకి ఉంది. అశ్వనీదత్ నమ్మకం అదే. తాను నమ్మింది హీరోనో, దర్శకుడినో కాదు. కథని. ఆ కథ.. ఈ సినిమాని ఏ స్థాయిలోకి తీసుకెళ్లిందో, అశ్వనీదత్ నమ్మకాన్ని నిజం చేసిందో లేదో తెలియాలంటే ఆగస్టు 5 వరకూ ఆగాలి. ఎందుకంటే... సీతారామం వస్తోంది... అప్పుడే.