రైతు పోరాటంతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. రైతుల పిలుపు మేరకు భారత్ బంద్ కూడా విజయవంతంగా పూర్తయ్యింది. అయితే... చిత్రసీమ నుంచి రైతులకు అందిన మద్దతు అంతంత మాత్రమే. తమిళ హీరోల్లో కార్తి లాంటి ఒకరిద్దరు తప్ప, స్పందించిందెవరూ లేరు. కమల్ హాసన్ రైతులకు మద్దతు తెలిపినా.. అందులోనూ రాజకీయ కోణమే కనిపించింది. తెలుగు నాట హీరోలెవరూ..రైతు పోరాటానికి కనీసం మద్దతు తెలపలేదు. కనీసం ట్వీట్ల ద్వారా అయినా తమ సంఘీభావం చూపించలేదు.
రైతులపై వాళ్లకున్న ప్రేమ ఇంతేనా? సినిమాల్లో రైతుల్ని వాడుకోవడం తప్ప, వాళ్లని ఆదుకోవడమే లేదా? అనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మహేష్‌బాబు చేసిన మహర్షి రైతు కథే. అత్యంత సంపన్నవంతుడైన కథానాయకుడు పొలంలో దిగి, రైతుగా మారతాడు. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. చిరంజీవి `ఖైదీ నెం 150`లోనూ రైతు సమస్యలపై పోరాటం చేశాడు. అదీ సూపర్ హిట్టే. ఓ సినిమాలో బాలయ్య కూడా రైతుల కోసం గళం విప్పాడు. ఎన్టీఆర్ లాంటి హీరోలూ.. రైతుల గురించి సుదీర్ఘమైన డైలాగులు వల్లించినవాడే.
అయితే వీళ్లెవరూ.... ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో రైతులకు అండగా నిలవలేదు. కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయలేదు. రేపో మాపో.. రైతు ఇతి వృత్తాలపై వీళ్లంతా మళ్లీ సినిమాలు చేయొచ్చు. అప్పుడు వీళ్ల డైలాగులకు మాత్రం క్లాపులు రాలవు. పైగా రైతుల గురించి మాట్లాడినప్పుడల్లా జోక్ గా అనిపిస్తుంటుంది. వీళ్ల పోరాటం వెండి తెరపై మాత్రమే అని, నిజ జీవితంలో కాదని తాజా ఘటన స్పష్టం చేసింది. వీళ్లంతే... రీలు హీరోలే అని మనం కూడా ఫిక్సయిపోవడం బెటర్.