కొత్త కథలేం ఉండవు. పాత కథలనే కొత్తగా చెప్పాలి. ఇప్పటి స్టార్ హీరోలు కూడా అదే సూత్రం పాటిస్తున్నారు. కొత్త కథల పేరుతో అతి ప్రయోగాలు చేసి, చేతులు కాల్చుకోవడం కంటే, పాత కథకే కాస్త మేకప్పులు చేసి, కొత్తగా చూపించాలని ఆరాట పడుతున్నారు. `సర్కారు వారి పాట` సినిమా కూడా కొన్ని పాత కథల సమాహారం అని తేలింది.
బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పు తీసుకుని, ఎగ్గొట్టే, వైట్ కాలర్ నేరస్థుల గురించి ఈ సినిమా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదే కథలో.. ఛాలెంజ్, శివాజీ లాంటి సినిమాల రిఫరెన్సులు కూడా బోలెడన్ని కనిపిస్తాయట. చేతిలో 5 పైసల బిళ్లతో 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేసిన ఓ యువకుడి కథ.. ఛాలెంజ్. శివాజీలో కూడా అంతే. చేతిలో రూపాయి బిళ్లతో తాను పోగొట్టుకున్న కోట్లన్నీ గడిస్తాడు. ఈ రెండు కథల రిఫరెన్సులూ... సర్కారు వారి పాటలో కనిపిస్తాయని తెలుస్తోంది. అమ్మానాన్నలు రూపాయి బిళ్ల ఆస్థిగా ఇస్తే, ఆ రూపాయిని హీరో కోట్లుగా ఎలా మార్చాడన్నది ఈ సినిమా కథట. మరి ఇదెంత వరకూ నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.