'బాహుబలి ది కంక్లూజన్' రిలీజ్ దగ్గరపడింది. ఏప్రిల్ 28వ తేదీన సినిమా విడుదల కానుంది. సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. సినిమా పనులన్నీ పూర్తయినట్లు రాజమౌళి ప్రకటించాడు. సెన్సార్ పూర్తయ్యిందంటే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చాలామందికి తెలిసిపోయి ఉండాలి. కానీ ఆ సీక్రెట్ ఇంకా రివీల్ కాలేదు. సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి అలా అలా పాకేసి ఉంటుందని భావించారుకానీ అలా జరగకపోవడం ఆశ్చర్యకరం. ఆ సస్పెన్స్‌ని ఇంతకాలం మెయిన్‌టెయిన్ చేయడమే ఓ అద్భుతం. 'బాహుబలి'లో ఉన్న అనేక కీలకమైన పాత్రల్లో కట్టప్ప కూడా ఒకటి. ఇందులో ఏ పాత్రకి ఆ పాత్రే హీరో. బాహుబలి - భళ్ళాలదేవ ఒకరితో ఒకరు తలపడినా, వారికి సపోర్టింగ్‌గా ఉన్న ప్రతి క్యారెక్టర్ అద్భుతమే. వాటన్నిటిలోకీ కట్టప్ప కీలకం. ఎందుకంటే కట్టప్ప అంతలా జనంలోకి వెళ్ళిపోయిన పాత్ర. ఇంకో వైపున ఈ పాత్ర ఇప్పుడు ఈ సినిమాకి కర్నాటకలో ఇబ్బందులు తెస్తోంది. పాత్ర కాదు, పాత్రలో నటించిన సత్యరాజ్ కారణంగా కర్నాటకలో సినిమా విడుదలవడం అనుమానాస్పదంగా మారింది. సినిమా విడుదలకు ససేమిరా అంటున్నారు కర్నాటకలో కొందరు. సత్యరాజ్ దిష్టిబొమ్మల్ని తగలబెడుతున్నారు కూడా. సత్యరాజ్ అనే ఒక్క నటుడి కారణంగా సినిమాని ఆపివేయాలనుకోవడం ఎంతవరకు సబబో ఆందోళనకారులు ఆలోచించుకోవాలి.