ఆర్.ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్ పేరు మార్మోగిపోయింది. ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయింది. పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. రవితేజ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల పక్కన ఛాన్సులు కొట్టేసింది. ఇలాంటి దశలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఒప్పుకుంది. కథానాయికగా ఎదిగే క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఎవరైనా మొగ్గు చూపిస్తారు. కాకపోతే.. ముందు గ్లామర్ పాత్రలు చేసి, ఆ తరవాత.. ఆ తరహా కథల్ని ఎంచుకుంటారు. కానీ పాయల్ మాత్రం తొందరపడిందేమో అనిపించింది.
పైగా కొంతమంది అగ్ర కథానాయికలు `నో` చెప్పిన కథని పాయల్ ఓకే చేసి సాహసం చేసింది. అదే `ఆర్.డి.ఎక్స్ లవ్` శంకర్ భాను దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై... డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. సినిమాలో విషయం లేదని ప్రచార చిత్రాలు చూసి అర్థం చేసుకున్నా - వెండి తెరపై మాత్రం దిగజారుడు సన్నివేశాలతో మరింత నాసికరంగా తయారైంది. పాయల్ పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ఏమంత బాగాలేదు.
తొలి సినిమాతో పాయల్ కి వచ్చిన గుర్తింపుని క్యాష్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్టు అనిపించింది. ఈ సినిమాతో నిర్మాతలు బీ, సీ సెంటర్లలో కాస్తంత సొమ్ము చేసుకోవచ్చేమో..? పాయల్ కెరీర్‌లో మాత్రం ఆదిలోనే హంస పాదు ఎదురైనట్టు అనిపిస్తోంది. మరో హిట్టు కొట్టి - తన కెరీర్‌ని ముందుకు నడిపించుకోవాల్సిన తరుణంలో ఏరి కోరి, డబ్బుల కోసం ఇలాంటి పాత్ర చేసింది. ఈ ఎఫెక్ట్ పాయల్‌పై గట్టిగానే పడే ప్రమాదం ఉంది.