ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి పద్మ అవార్డుల జాబితాలో.. కచ్చితంగా బాలూ పేరు ఉంటుందని ఆయన అభిమానులు ఊహించారు. అయితే.. వాళ్లంతా భారత రత్నపై ఆశలు పెట్టుకున్నారు. బాలూ మరణాంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది. సాక్ష్యాత్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సైతం.. బాలూకి భారతరత్నపై గళం విప్పారు. ఆయన భారత రత్నకు నూటికి నూరు శాతం అర్హుడని... ఆయన అభిమానుల నమ్మకం.
కేంద్రం మాత్రం బాలూకి పద్మవిభూషణ్‌తో సరిపెట్టింది. భవిష్యత్తులో బాలూకి భారతరత్న ఇస్తారన్న నమ్మకాలైతే ఎవ్వరికీ లేవు. బాలూ ఎప్పటికీ పద్మ విభూషణుడే. బాలూకి భారతరత్న ఇవ్వకపోవడానికి చాలా కారణాలున్నాయి. మహమ్మద్ రఫీ, ఘంటసాల లాంటి గాయకులకే ఆ పురస్కారం దక్కలేదు. కనీసం పద్మ విభూషణ్ కూడా రాలేదు. బాలూకి ఇప్పుడు భారత రత్న ఇచ్చేస్తే.. `వాళ్లకంటే.. బాలూ గొప్పగాయకుడా?` అన్న ప్రశ్న తలెత్తుతుంది. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాలూకి సైతం ఘంటసాల, రఫీ అభిమాన గాయకులు. రఫీ పాటంటే... బాలూ చెవి కోసుకుంటారు.
రఫీ కంటే గొప్పగాయకుడ్ని చూడలేదని... బాలూనే స్వయంగా చాలాసార్లు చెప్పారు. అలాంటిది.. రఫీకి అందని భారత రత్నం.. బాలూకి ఎందుకు దక్కుతుంది? బాలూకి పద్మవిభూషణ్ రావడం పట్ల అభిమానులు సంతోషంగానే ఉన్నా, తెలుగు ప్రజలకు గుర్రుగా ఉన్నారు. బాలూ పద్మ విషయంలో సిఫార్సు చేసింది తమిళ నాడు ప్రభుత్వం కావడమే అందుకు కారణం. బాలు తెలుగువాడైనా... తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేస్తే గానీ.. ఆయనకు పద్మ విభూషణ్ రాలేదని, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ విషయంలో చొరవ చూపించలేకపోయారని... వాళ్ల ఆవేదన.
నిజానికి బాలూకి భాషతో పనిలేదు. ఆయన అందరివాడు. పైగా ఆయన చాలా ఏళ్లుగా చెన్నైని అట్టిపెట్టుకునే ఉన్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చినా, ఆయన ఇటు రాలేదు. స్టూడియో కూడా అక్కడే కట్టుకున్నారు. చెన్నై వేదికగానే కార్యకలాపాలు సాగించారు. ఆయన ఆస్తులు అక్కడే ఉన్నాయి.కరోనా బారీన పడినప్పుడు చికిత్సా అక్కడే తీసుకున్నారు. ఆయన చికిత్సకి అయిన ఖర్చంతా తమిళనాడు ప్రభుత్వమే భరించింది. చివరికి ఆయన సమాధి కూడా అక్కడే వుంది. అందుకే.. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించి ఉండొచ్చు. బాలుకి ఎవరు సిఫార్సు చేసినా.. ఆయన ఇప్పుడు పద్మవిభూషణుడు అయ్యాడు. అది సంగీతాభిమానులకు, ముఖ్యంగా బాలూ అభిమానులు గర్వ పడే విషయమే.