భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో చిత్రబృందం హ్యాపీగా ఉంది. అయితే ఫ్యాన్స్ లో మాత్రం అసంతృప్తి నెలకొంది. దానికి కారణం... త్రివిక్రమ్ హడావుడి చేయకపోవడం. పవన్ సినిమా అంటే త్రివిక్రమ్ హాజరు, తన స్పీచు తప్పనిసరి. పైగా భీమ్లా నాయక్‌కి తను రచయిత కూడా. ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి కారణం తనే. ఈ సినిమాలో తనకీ వాటా ఉంది. అలాంటిది త్రివిక్రమ్ హడావుడి అస్సలు కనిపించలేదు. వేదికపై ఉన్నది కూడా కాసేపే. తను మాట్లాడనే మాట్లాడలేదు.
త్రివిక్రమ్ ఇంత సైలెంట్ గా ఎందుకు ఉన్నాడా, అనేదే అందరి డౌటు. ఈ ఫంక్షన్ కి త్రివిక్రమ్ చాలా ఆలస్యంగా వచ్చాడు. ఆయన రాడేమో అనుకున్న దశలో.. త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చాడు. భీమ్లా నాయక్ కి సంబంధించిన కొత్త ట్రైలర్ బుధవారం విడుదలైంది. త్రివిక్రమ్ ఆ ట్రైలర్‌ని రెడీ చేసే పనిలో బిజీగా ఉండిపోయాడని, అందుకే ఈ ఫంక్షన్ కి ఆలస్యంగా వచ్చాడని తెలుస్తోంది. పోనీ.. ఆలస్యంగా వచ్చినా మాట్లాడాలి కదా. కానీ త్రివిక్రమ్ నోరు విప్పలేదు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. అయితే, తెర వెనుక ఈ సినిమాని నడిపింది త్రివిక్రమే అని, తన డామినేషనే సెట్లో ఎక్కువగా కనిపించిందని టాక్. ఇప్పుడు కూడా వేదికపై ఎక్కి మాట్లాడి, క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే, త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయాడని తెలుస్తోంది.