డిశంబర్ సినిమాల సందడి దాదాపు ముగిసినట్లే. కొత్త సంవత్సరంలో పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. సంక్రాంతికి 'ఎన్టీఆర్ - కథానాయకుడు', రామ్‌చరణ్ 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వెంకీ - వరుణ్‌ల 'ఎఫ్ 2' కూడా ఈ రేస్‌లో ఉంది. అయితే వచ్చేది ఎన్నికల కాలం. తెలుగు రాష్ట్రాల్లో అందరూ రాజకీయాలపై ఆశక్తితో ఉంటారు. ఆ మూడ్‌కి తగ్గట్లే నాలుగు సినిమాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొలిటికల్ సందడి చేయబోతున్నాయి.
'ఎన్టీఆర్' బయోపిక్‌గా రెండు సినిమాలు వస్తుంటే, 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'యాత్ర', అను మరో రెండు పొలిటికల్ నేపథ్యమున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌గా రానున్న 'కథానాయకుడు', మహానాయకుడు' చిత్రాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలం. ఇది పక్కా. కానీ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం.
అలాగే దివంగత వైఎస్ఆర్ బయోపిక్‌గా వస్తున్న 'యాత్ర' కూడా టీడీపీకి వ్యతిరేకం. వైఎస్సార్ కాంగ్రెస్‌కి కొంత అనుకూలం. ఈ కొంత అనుకూలం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసింది కాంగ్రెస్ హయాంలో కాబట్టి. ఏది ఏమైనా సినిమాలకీ, రాజకీయాలకీ విడదీయలేని సంబంధం ఎప్పటి నుండో ఉంది కాబట్టి ఈ సినిమాల ప్రభావం ఎంతో కొంత రాజకీయాలపై ఉంటుంది.