ఓటీటీ సంస్థల కండీషన్లు చాలా తీవ్రంగా ఉంటున్నాయి ఈ మధ్య. ఎందుకంటే... వాళ్లకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సినిమా థియేటర్ లో విడుదలైన తరవాత, ఎన్ని రోజులకు ఓటీటీలో వస్తుందన్న విషయంలో పక్కా... నిబంధనలు ఉన్నాయి. అలానే, ఓ సినిమా ఓటీటీకి ఇచ్చి, వెనక్కి తీసుకుంటే ఏం చేయాలి? అనే విషయంపైనా రూల్స్‌ని కఠినంగా అమలు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు.
`వైల్డ్ డాగ్` అనే సినిమాని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారు నిర్మాతలు. నవంబరులోనే డీల్ క్లోజ్ అయ్యింది. అయితే.. ఇప్పుడు థియేటర్లు తెరచుకోవడంతో నిర్మాతల మనసు మారింది. వైల్డ్ డాగ్ ని థియేటర్లో విడుదల చేస్తే ఇంకాస్త మెరుగైన ఫలితం వస్తుందని భావించిన నిర్మాతలు ఓటీటీ నుంచి తమ సినిమాని వెనక్కి తీసుకొచ్చారు. అయితే ఇదంత సులభంగా ముగిసిన వ్యవహారం కాదు. ఒప్పందం రద్దు చేసుకున్నందుకు, సినిమాని వెనక్కి తీసుకున్నందుకు నెట్ ఫ్లిక్స్‌కి కొంత నష్టపరిహారం చెల్లించార్ట. అంతే కాదు... వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీ హక్కులు (థియేటర్లో విడుదలైన తరవాత) నెట్ ఫ్లిక్స్ కే తక్కువ రేటుకి ఇస్తామని చెప్పార్ట. దాంతో.. వైల్డ్ డాగ్ ఓటీటీ విడుదల ఆగి, థియేటర్ విడుదలకు మార్గం సుగమం అయ్యింది.