కరోనా వల్ల ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోయాయి. సినిమాల్ని పూర్తి చేయలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. నిర్మాతలు బావురుమంటున్నారు. అలాగని. `మీరు షూటింగులకు ఎప్పుడు వస్తారు` అని హీరోల్ని అడగలేరు. అడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో తెలుసు. అందుకే.. ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో ఉన్నారు నిర్మాతలు. నాగార్జున సినిమా `వైల్డ్ డాగ్` కూడా అందుకే ఆగిపోయింది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న `వైల్డ్ డాగ్` కి కరోనా వల్ల బ్రేకులు పడ్డాయి.
అయితే ఈ సినిమా విషయంలో నాగ్ వైఖరి ఇప్పుడు నిర్మాతలకు ఆగ్రహం తెప్పిస్తోందని టాలీవుడ్ టాక్. నాగ్ ఇటీవల `బిగ్ బాస్ 4` సీజన్‌కు రెడీ అయిపోయాడు. ప్రోమో షూట్ కూడా చేశారు. అత్యంత కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్తల మధ్య షూటింగ్ చేస్తున్నట్టు నాగ్ ఓ ఫొటో విడుదల చేశాడు. అవే జాగ్రత్తలు మేం కూడా తీసుకుంటాం కదా, మా షూటింగ్ కూడా మొదలుపెట్టొచ్చు కదా.. అని నిర్మాతలు అభిప్రాయ పడుతున్నార్ట. బిగ్ బాస్ కి లేని కరోనా భయాలు, సినిమాలకు ఎందుకు..? అన్నది వాళ్ల వాదన. అదీ నిజమే. కానీ.. నాగార్జున లాంటి పెద్ద స్టార్ తో జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకే నిర్మాతలు సైలెంట్ అయిపోయార్ట. అయితే సినిమా షూటింగ్ వేరు, టీవీ వేరు. సినిమాకి కనీసం 100 నుంచి 150 వరకూ సిబ్బంది ఉంటారు. టీవీ షూటింగులకు అంత అవసరం లేదు. అందుకే నాగ్ ధైర్యం చేస్తున్నాడేమో..?