గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. చిత్రసీమపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఎన్ని ఆటలు కావాలంటే అన్ని ఆటలు ప్రదర్శించుకోవచ్చని, టికెట్ రేటు ఎంతైనా పెంచుకోవచ్చని... పచ్చజెండా ఊపేశారు. నిజంగా.. చిత్రసీమకు ఇది ఊరట ఇచ్చే విషయమే. కొత్త సినిమాలు వచ్చినప్పుడు వీలైనన్ని ఎక్కువ ఆటలు ప్రదర్శించాలని, తద్వారా ఎక్కువ మొత్తం రాబట్టాలని నిర్మాతలకు ఉంటుంది. బెనిఫిట్ షోలూ, ఫ్యాన్స్ షోలు, అర్థరాత్రి ఆటలతో... రాబడి పెంచుకోవాలని భావిస్తారు. ఇది వరకు ఆ అవకాశం లేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు నిషేధించారు. ఇప్పుడు ఆ బాధ తప్పింది.
అయితే.. టికెట్ రేట్లు పెంచుకోవడం పట్ల భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రేక్షకులు ఓటీటీలో ఉచిత సినిమాల్ని చూడ్డానికి అలవాటు పడ్డారు. వాళ్లని థియేటర్లకు మళ్లీ ఎలా తీసుకురావాలన్న విషయంలో చిత్రసీమ మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి దశలో టికెట్ రేట్లు తగ్గించాలి గానీ, పెంచే అవకాశం నిర్మాతలకు ఇస్తే ఎలా ? అనే ఓ వాదన వినిపిస్తోంది. పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు ఎలాగూ నిర్మాతలు టికెట్ రేట్లు అమాంతం పెంచేస్తారు. చిన్న సినిమాల విషయంలో మాత్రం ఆ ధైర్యం చేయలేరు. ఎందుకంటే చిన్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. స్టార్ హీరోల సినిమా అయినా ఉండాలి, లేదంటే కంటెంట్ తోనైనా ఆకట్టుకోవాలి. ఇలాంటి సినిమాలకే అగ్రతాంబూలం. అలాంటప్పుడు చిన్న సినిమాలు, ఓ మాదిరి బడ్జెట్ సినిమాల రేట్లు పెంచితే, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి.. ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో అనుమతులు ఇచ్చినా, నిర్మాతలు ఆ రిస్క్ తీసుకోరు.