ఎప్పుడూ లేనంత రభస ఈసారి `మా` ఎన్నికల సమయంలో జరిగింది. ముఖ్యంగా లోకల్ - నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. చివరికి `తెలుగువారి ఆత్మ గౌరవం` నినాదంతో మంచు విష్ణు గెలిచారు. ఎన్నికలు అయిపోయిన తరవాత కూడా ఈ రగడ కొనసాగుతూనే ఉంది. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే.. ప్రకాష్‌రాజ్ ప్రెస్ మీట్ పెట్టి, తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ప్రకాష్‌రాజ్ రాజీనామాని మంచు విష్ణు ఆమోదించలేదు. దాంతో ప్రకాష్ రాజ్ కూడా `పరాయి భాష నుంచి వచ్చిన వాళ్లు `మా` లో పోటీ చేయకూడదు` అంటూ `మా` బై లాలో మార్పు చేయనంటే, రాజీనామా ఉపసంహరించుకుంటా` అన్నారు. దీనిపై మాత్రం విష్ణు స్పందించలేదు.
అయితే.. సోమవారం తిరుమలలో... విష్ణు కొన్నికీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా `మా`లో ఉన్న నియమ నిబంధనల గురించి. `ఎవరు పడితే వాళ్లు `మా` అధ్యక్షుడిగా పోటీ చేయడానికి వీల్లేని నిబంధన తీసుకొస్తాం` అని ఈ సందర్భంగా ప్రకటించారు. దాని అర్థం.... నాన్ లోకల్ ఇష్యూని మళ్లీ తెరపైకి తీసుకురావడమే. ప్రకాష్‌రాజ్ ఏదైతే షరతు విధించారో, ఇప్పుడు దానికి విరుద్ధంగా... విష్ణు నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట. అయితే.. బై - లా మార్చడం అంత ఈజీ కాదు. సినీ పెద్దలంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. పరాయి భాష నుంచి వచ్చిన వాళ్లు `మా` సభ్యులుగా ఉండొచ్చు గానీ, అధ్యక్షుడిగా పోటీ చేయకూడదు అనే నిబంధన హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి.. ఇలాంటి నిబంధనకు `మా` పెద్దలు ఒప్పుకోకపోవొచ్చు. పైగా.. బై - లా మార్చాలంటే.. ఓటింగ్ జరగాలి. మెజారిటీ వర్గం ఆమోదించాలి. అదంత ఈజీగా జరక్కపోవొచ్చు.